Shapoor Zadran ఆఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్(38) అకాల మరణం క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అరుదైన, ప్రాణాంతక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు మిగిలి ఉండగానే చిన్న వయసులోనే కన్ను మూశాడు. అసలేంటీ వ్యాధి? తెలుసుకుందాం.
'హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసైటోసిస్' ((Hemophagocytic Lymphohistiocytosis) అనే వ్యాధితో చికిత్స పొందుతూ జద్రాను మరణించాడని ప్రకటించిన ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) తీవ్ర విచారాన్ని వెలిబుచ్చింది. ఆఫ్గానిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో, దేశ క్రికెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో షాపూర్ జద్రాన్ అందించిన సేవలు, నిబద్ధత ఎనలేనివంటూ బోర్డు అతనికి నివాళులర్పించింది.
HLH అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స
ఇది చాలా అరుదైన, తీవ్రమైన రోగనిరోధక వ్యవస్థ (Immune System) రుగ్మత. సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ బాక్టీరియా, వైరస్‌ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. కానీ, ఈ వ్యాధి సోకినప్పుడు రోగనిరోధక వ్యవస్థ చాలా యాక్టివ్ అయి పోతుంది. ఇన్ఫెక్షన్లపై పోరాడాల్సింది పోయి సొంత శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాలు, అవయవాలపైనే దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా లివర్, ప్లీహం (Spleen), ఎముక మజ్జ (Bone Marrow), మెదడు వంటి ముఖ్యమైన అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి.

HLH రావడానికి కారణలు
1. సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రుల నుండి వచ్చే జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంది. ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది.
2. అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్లఈ వ్యాధిసోకవచ్చు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్లు (ఉదాహరణకు ఎప్‌స్టీన్-బార్ వైరస్), లూపస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు లేదా బ్లడ్ క్యాన్సర్ (లింఫోమా, ల్యుకేమియా) వంటి వాటి వల్ల ఇది రావచ్చు.
ముఖ్యలక్షణాలు
దీని లక్షణాలు సాధారణ ఇన్ఫెక్షన్ల లాగే ఉండటం వల్ల మొదట్లో గుర్తించడం కష్టం.
తగ్గని తీవ్రమైన జ్వరం, తీవ్రమైన అలసట, బలహీనత
కాలేయం (లివర్), ప్లీహం వాపునకు గురవడం
చర్మంపై దద్దుర్లు, సులభంగా రక్తస్రావం కావడం లేదా వాతలు పడటం
రక్తహీనత వల్ల చర్మం తెల్లబడటం లేదా కామెర్లు (Jaundice) రావడం
తీవ్రమైన సందర్భాల్లో ఫిట్స్ (Seizures) రావడం లేదా మతిస్థిమితం తప్పడం.
వ్యాధి నిర్ధారణ , చికిత్స
ఈ వ్యాధి సోకిందని నిర్ధారించేకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కేవలం ఒకే ఒక పరీక్షతో దీనిని నిర్ధారించలేరు. రక్తం లోని కణాల సంఖ్య, ఫెర్రిటిన్ (Ferritin) స్థాయిలు, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు, మరియు బోన్ మ్యారో పరీక్షల ద్వారా వైద్యులు దీనిని గుర్తిస్తారు.
మితిమీరిన రోగనిరోధక శక్తిని అదుపు చేయడానికి కార్టికోస్టెరాయిడ్స్, కీమోథెరపీ మందులు, ఇమ్యునోథెరపీ ఇస్తారు. ఇన్ఫెక్షన్ల నివారణకు యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. జన్యుపరమైన సమస్య ఉన్నవారికి లేదా పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి 'స్టెమ్ సెల్ (బోన్ మ్యారో) ట్రాన్స్‌ప్లాంటేషన్' మాత్రమే ఏకైక మార్గం.
ఇదీ చదవండి: రెడ్ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా!


