వయసేమో 20.. మోకాళ్లేమో 60! | Joint pain genetics may be putting millennials and Gen Z at risk | Sakshi
Sakshi News home page

వయసేమో 20.. మోకాళ్లేమో 60!

Jul 8 2026 12:30 PM | Updated on Jul 8 2026 2:09 PM

Joint pain genetics may be putting millennials and Gen Z at risk

కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులనేవి వృద్ధాప్యానికి సంకేతాలుగా మనం భావిస్తుఉంటాం. కానీ ప్రస్తుత ‘జెడ్ జనరేషన్’ యువతను ఈ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇటీవల కాలంలో చిన్న వయస్సు వారే మోకాళ్లు బిగుసుకుపోవడం, కీళ్ల వాపులు, భుజాల నొప్పులు తదితర ఫిర్యాదులతో భారీగా ఆస్పత్రుల బాట పడుతున్నారు.

యువతలో ఇంత వేగంగా కీళ్ల సమస్యలు పెరగడానికి కేవలం వారి ఆధునిక జీవనశైలి మాత్రమే కారణం కాదు. దీని వెనుక బలమైన 'జన్యుపరమైన' కారణాలు కూడా దాగున్నాయని వైద్యులు చెబుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) లేదా రోగనిరోధక వ్యవస్థ లోపాలు (ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్) ఉన్నట్లయితే, ఆ వంశంలోని యువతకు ఈ ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోసింగ్ స్పాండిలైటిస్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది. తల్లిదండ్రులు లేదా తోబుట్టువులలో ఈ సమస్యలు ఉంటే, వారి పిల్లలకు చాలా చిన్న వయస్సులోనే ఈ లక్షణాలు బయటపడవచ్చు.

దీనికి తోడు ప్రస్తుత జెడ్ జనరేషన్ ఉద్యోగుల జీవనశైలి ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. గంటల తరబడి డెస్క్‌లకే పరిమితం కావడం, శారీరక శ్రమ లేకపోవడం (సెడెంటరీ లైఫ్ స్టైల్) వంటి అలవాట్లు జన్యుపరమైన లోపాలతో తోడై.. కీళ్ల వాపులను, కార్టిలేజ్ (మృదులాస్థి) దెబ్బతినడాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయి. ఈ తరం యువతలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే.. తమకు వస్తున్న నొప్పులు ఆర్థరైటిస్ కావచ్చు అని వారు అస్సలు ఊహించడం లేదు. ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోవడం, విశ్రాంతి తీసుకున్నాక కూడా వాపులు తగ్గకపోవడం వంటి ప్రాథమిక హెచ్చరికలను వారు అలసట, పని ఒత్తిడి లేదా పడుకునే పద్ధతి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చినవిగా భావించి కొట్టిపారేస్తున్నరు.

ఈ నిర్లక్ష్యం కారణంగా సరైన సమయంలో వైద్యులను సంప్రదించకుండా  ఏళ్ల తరబడి వ్యాధి నిర్ధారణను ఆలస్యం చేస్తున్నారు. తద్వారా చిన్న వయస్సులోనే కీళ్లు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. యువతలో కీళ్ల నొప్పులను ముందే గుర్తించడమే కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొదటి అడుగు. వంశపారంపర్యంగా వచ్చే జన్యువులను మనం మార్చలేం. కానీ ఈ సమస్యను ఖచ్చితంగా నియంత్రించవచ్చు. క్రమం తప్పకుండా శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, ఎక్కువసేపు ఒకే చోట కదలకుండా కూర్చోకుండా ఉండటం వంటి చిన్న జాగ్రత్తల ద్వారా కీళ్ల నొప్పుల తీవ్రతను తగ్గించవచ్చు లేదా రాకుండా నివారించవచ్చు. ముందే గుర్తించి, సరైన వైద్య పరీక్షల ద్వారా చికిత్స తీసుకుంటే దీర్ఘకాలిక వైకల్యాల బారిన పడకుండా కీళ్ల కదలికలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

(మణిపాల్ హాస్పిటల్ వైట్‌ఫీల్డ్‌కు చెందిన ఆర్థోపెడిక్ సర్జరీ అండ్‌ రోబోటిక్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ గిరీషా బి.ఎ ‘మాతృభూమి’కి అందించిన వివరాల ఆధారంగా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement