డీఎస్పీగా రైల్వే గేట్‌మ్యాన్..! 12 గంటలు పనిచేస్తూనే.. | Raju Kumar Success Story: Railway gateman from Bihar becomes DSP | Sakshi
Sakshi News home page

డీఎస్పీగా రైల్వే గేట్‌మ్యాన్..! 12 గంటలు పనిచేస్తూనే..

Jul 2 2026 4:04 PM | Updated on Jul 2 2026 4:47 PM

Raju Kumar Success Story: Railway gateman from Bihar becomes DSP

చుట్టూ చిమ్మ చీకటి..మంచి జీవితం ఎలా పొందాలో తెలియని అయోమయం. ఒకపక్క తండ్రి మరణం..చాలిచాలని ఆర్థికస్థితి ఇలాంటి పరిస్థితుల నడుమ చదవు మీద ధ్యాస పెట్టడం అంత ఈజీ కాదు. అయినా చదువు తప్ప మరేది తన జీవితాన్ని మార్చేలేదని నమ్మి..కష్టపడి చదివి చిన్న రైల్వేగేట్‌మ్యాన్‌​ ఉద్యోగం సాధించాడు. అక్కడితో ఆగిపోకుండా అత్యున్నత స్థాయి అధికారిగా ఉండాలన్న ఆకాశమంత లక్ష్యంతో ముందుకు సాగాడు..అనుకున్నట్లుగానే..డీఎస్పీ రేంజ్‌కు చేరుకుని శెభాష్‌ అనిపించుకున్నాడు. చుట్టూ ఉన్న వనరులు, పరిమితులు అచంచలమైన ఆత్మవిశ్వాసం ముందు తలవంచుతాయని నిరూపించాడు.

అతడే బిహార్‌కు చెందిన రాజు కుమార్. అతనికి 12 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. దాంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేది. చదువు కొనసాగించడం అత్యంత సవాలుగా ఉండేది. అయితే కజిన్‌  రాజేష్ కుమార్ సుమన్ అందించిన మద్దతుతో చదువుని కొనసాగించాడు. రాజేష్ రోసెరాలో ఉచిత BSS (బిహార్‌ సేవక్‌ సమాజ్‌)క్లబ్‌ను నడిపేవాడు, అక్కడ విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం ఉచిత గైడెన్స్‌ ఇచ్చేవారు. ఈ మద్దతుతో రాజు చదువు కొనసాగిస్తూనే, రైల్వే గ్రూప్ డి పరీక్ష రాసి, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. 

అలా అతను రక్సౌల్‌లో గేట్‌మ్యాన్ పోస్టుకు ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం అతనికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చి, తన కుటుంబానికి సహాయపడటానికి వీలు కల్పించింది. అక్కడితో తన జర్నీని ఆపాలనుకోలేదు..ఎలాగైన అత్యున్నతాధికారి కావాలన్న ఆకాంక్షతో రైల్వేడ్యూటీని కొనసాగిస్తూనే గ్రాడ్యుయేషన్‌లో చేరి బీహార్‌ పోలీస్‌ సర్వీస్‌ కమిషన్‌(బీపీఎస్సీ)కు సిద్ధమయ్యాడు. ఉద్యోగాన్ని, పోటీ పరీక్ష ప్రిపరేషన్‌ని సమన్వయం చేసుకోవడం సవాలుగా ఉన్నా.. సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ప్రిపరేషన్‌ కొనసాగించాడు. 

రాజు తన 12 గంటల పని షిఫ్టులు చేస్తూనే రాత్రిపూట కూడా చదువుకుంటూ గడిపాడు. సింపుల్‌గా చెప్పాలంటే తన రోజువారీ రైల్వే ఉద్యోగంతో పాటే అతని ప్రిపరేషన్ కూడా కొనసాగింది. చివరికి అతని కష్టానికి తగిన ఫలితం దక్కింది. అలా తన తొలి ప్రయత్నంలోనే బీహార్ పోలీస్ సర్వీస్‌లో డీఎస్పీగా స్థానం సంపాదించాడు. 

ఈ విజయం సాధించిన తర్వాత కూడా రాజు తన ఉద్యోగ దినచర్యను కొనసాగించడం విశేషం. అతను ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజు, రక్సౌల్‌లోని రైల్వే గేట్ నెం.33 వద్దకు తిరిగి వచ్చి, యధావిధిగా తన విధిని నిర్వర్తించాడు. ఇక్కడ రాజు కథ..కష్టాలనేవి అనివార్యం..వాటికి తలొగ్గక, భయపడక దొరికిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అభ్యున్నతి మార్గంలో ముందుకు సాగిపోవాలనే సత్యాన్ని నేర్పిస్తోంది కదూ..!.

(చదవండి: Serena Williams: చేతి ఉంగరం అన్ని కోట్లా..! ఆఖరికి నైల్స్‌కు కూడా..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement