సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. వివాహమైన నెల రోజులకే హనీమూన్ సమయంలో నెలసరి వచ్చిందన్న ఆగ్రహంతో తన భర్త తనపై దాడిచేయడంతో, గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఆరోపించిన కేసు కలకలం రేపుతోంది.
యూపీలోని రామ్‌ఘర్‌తాల్ ప్రాంతానికి చెందిన సదరు మహిళ తన ఫిర్యాదులో, ఢిల్లీకి చెందిన తన భర్త నిఖిల్ మిశ్రాపై కేసు నమోదు చేసింది.ఈ ఫిర్యాదు ప్రకారం 2023 మే 30న ఢిల్లీకి చెందిన నిఖిల్ మిశ్రాతో ఈమెకు వివాహమైంది. ఆ తర్వాత జూలై 4న హనీమూన్ కోసం అండమాన్ వెళ్లారు. అక్కడికి వెళ్లాక తీవ్రమైన కడుపునొప్పి, పీరియడ్స్ వచ్చాయి. అధిక రక్తస్రావం జరిగింది. దీంతో రుతుక్రమం గురించి తనకు ముందుగానే ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తూ భర్త తనపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది. అలాగే గొంతు నులమడానికి ప్రయత్నించాడని కూడా చెప్పింది. ఆమెకు రుతుక్రమం (పీరియడ్స్) రావడంతో ఆగ్రహానికి గురైన భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొంది. చివరికి హోటల్ సిబ్బంది ఆమె కేకలు విని రక్షించినట్లు బాధితురాలు తెలిపింది.
కట్నం కోసం వేధింపులు
పెళ్లిలో కట్నంకోసం వేధించారని కూడా ఫిర్యాదు చేసింది. రూ. 20 లక్షల నగదు, ఒక కారు, రూ. 40 లక్షల విలువైన వస్తువులు కట్నంగా ఇచ్చినప్పటికీ, బ్రాండెడ్ వస్తువులు తీసుకురాలేదని అత్త, ఆడపడుచు మానసికంగా వేధించారని తెలిపింది. అంతేకాదు పెళ్లయిన 45 రోజులకే (జూలై 14, 2023) ఆమెను అత్తవారింటి నుంచి వెళ్లగొట్టారు. సమస్యను పరిష్కరించడానికి వచ్చిన ఆమె తండ్రిని కూడా అవమానించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి పలుమార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. ఇప్పటికీ కట్నంగా ఇచ్చిన వస్తువులను తిరిగి ఇవ్వలేదని, తన భర్త ఇంకా తనకు బెదిరింపు సందేశాలు పంపుతూనే ఉన్నాడని కూడా ఆమె ఆరోపించింది.
ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
మొత్తానికి గోరఖ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కౌస్తుభ్ జోక్యంతో ఎట్టకేలకు ఆగస్టు 15న భర్త, అత్త మరియు ఆడపడుచుపై FIR నమోదు చేశారు. మిశ్రా, అతని తల్లి సంజు మిశ్రా సోదరి నేహా పాండేలపై సదరు మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 15న ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు రామ్‌ఘర్‌తాల్ ఎస్‌హెచ్‌ఓ శ్యామ నంద్ రాయ్ తెలిపారు. విచారణలో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్‌కు బాబా రామ్‌దేవ్ హెచ్చరిక


