అణ్వాయుధాలు వాడుతాం.. పుతిన్‌ సంచలన ప్రకటన | Putin Comments On Nato Over Russia Kaliningrad Issue | Sakshi
Sakshi News home page

అణ్వాయుధాలు వాడుతాం.. పుతిన్‌ సంచలన ప్రకటన

Oct 2 2026 7:52 AM | Updated on Oct 2 2026 8:27 AM

Putin Comments On Nato Over Russia Kaliningrad Issue

రష్యా-పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక హెచ్చరిక చేశారు. రష్యా భూభాగమైన కలినిన్‌గ్రాడ్‌పై ప్రత్యక్ష దాడి జరిగితే.. తమ దేశం వద్ద ఉన్న అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించే అంశం వెంటనే తెరపైకి వస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే అణ్వాయుధాలను కూడా ఉపయోగించే పరిస్థితి తప్పదని పుతిన్‌ వ్యాఖ్యానించారు.

మాస్కోలో జరిగిన వాల్డై ఫోరంలో మాట్లాడిన పుతిన్‌.. రష్యాకు యూరప్‌లోని ఏ దేశంపైనా దాడి చేసే ఉద్దేశం లేదన్నారు. శాంతియుత సహజీవనాన్నే కోరుకుంటున్నామని చెప్పారు. అయితే కలినిన్‌గ్రాడ్‌ లేదా రష్యాలోని ఇతర ప్రాంతాలపై ప్రత్యక్ష దాడి జరిగితే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని హెచ్చరించారు. రష్యా వద్ద ఉన్న ఆయుధాలు తమకు పోటీ ప్రయోజనం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వద్ద ఉన్న అణ్వాయుధ సామర్థ్యాల గురించి కూడా తమకు పూర్తిగా తెలుసని చెప్పారు.

ప్రస్తుత ఉద్రిక్తతలు మరింత పెరిగితే తిరిగి మార్చలేని స్థాయికి పరిస్థితులు చేరుకునే ప్రమాదం ఉందని పుతిన్‌ హెచ్చరించారు. ప్రపంచంలోని ప్రధాన శక్తుల వద్ద భారీ విధ్వంసానికి కారణమయ్యే ఆయుధాలు ఉన్నాయని, వాటి వినియోగానికి దారితీసే పరిస్థితులను నివారించాలని సూచించారు.

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపే ప్రసక్తే లేదని పుతిన్‌ స్పష్టం చేశారు. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ దాడుల వల్ల తమ దేశ జీడీపీలో సుమారు ఒక శాతం మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు రష్యా భూభాగంలోకి లోతుగా దాడులు చేసే సామర్థ్యాన్ని అందిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

కాగా, రష్యాకు చెందిన కలినిన్‌గ్రాడ్‌.. పోలాండ్‌, లిథువేనియా మధ్య ఉన్న ప్రాంతం. నాటో సభ్య దేశాల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో రష్యా భారీగా సైనిక బలగాలను మోహరించింది. కలినిన్‌గ్రాడ్‌ను నాటో నుంచి వేరుచేసే ప్రయత్నం జరిగితే అణ్వాయుధాల వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లు మాస్కో ఇప్పటికే దౌత్యపరమైన హెచ్చరికలు జారీ చేసిందని నాటో వెల్లడించింది. దీనిపై నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రుట్టే స్పందిస్తూ.. నాటో రక్షణాత్మక కూటమి మాత్రమేనని, అణ్వాయుధాల బెదిరింపులు ఉపయోగకరం కాదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement