‘వర్క్‌ ఫ్రమ్‌ ఫారెస్ట్‌’.. మూడు రోజులకు రూ.14 వేలు! | Kerala Launches Forest Workation in Gavi and Suryanelli | Sakshi
Sakshi News home page

‘వర్క్‌ ఫ్రమ్‌ ఫారెస్ట్‌’.. మూడు రోజులకు రూ.14 వేలు!

Oct 1 2026 1:11 PM | Updated on Oct 1 2026 1:19 PM

Kerala Launches Forest Workation in Gavi and Suryanelli

తిరువనంతపురం: ఇంట్లో కూర్చొని పని చేయడం (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) గురించి మనకు తెలిసిందే.. మరి అడవిలో ఉండి పని చేయడం(వర్క్‌ ఫ్రమ్‌ ఫారెస్ట్‌) ఎలా ఉంటుంది? కేరళ ప్రభుత్వం ఇప్పుడు ఇదే ఆలోచనతో కొత్త వర్కేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేరళ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (కేఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో గవి, సూర్యనెల్లి ప్రాంతాల్లో రిమోట్‌ ఉద్యోగులు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

అడవిలోనే పని.. మధ్యలో ట్రెక్కింగ్‌
అటవీ శాఖ పర్యవేక్షణలో ఈ ‘వర్కేషన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘వర్క్‌’, ‘వెకేషన్‌’ అనే రెండు పదాల కలయికే వర్కేషన్‌. అంటే ఉద్యోగ బాధ్యతలను కొనసాగిస్తూనే ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపడం. ఇందుకోసం గవి, సూర్యనెల్లిలో హైస్పీడ్‌ వై-ఫై, కేఫెటీరియా సదుపాయాలను ఏర్పాటు చేశారు. పని మధ్యలో విరామం తీసుకుని అడవిలో ట్రెక్కింగ్‌ చేసే అవకాశమూ ఉంటుంది.

మూడు రోజుల ప్యాకేజీ.. రూ.14 వేలు
ఈ వర్కేషన్‌ కోసం మూడు రోజుల ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో వసతి, భోజనం, ట్రెక్కింగ్‌ ఉన్నాయి. ప్యాకేజీ ధర రూ.14,000. ఒక్క గదిలో ఇద్దరు ఉండొచ్చు. తొలి దశలో మొత్తం నాలుగు గదులను సిద్ధం చేశారు. అంటే ప్రకృతి మధ్యలో ఉండి పని చేయాలనుకునే వారికి పరిమిత సంఖ్యలోనే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

అడవి అందాల మధ్యలో..
పతనంతిట్ట జిల్లాలోని గవి ప్రాంతం పెరియార్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 1,036 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం పూర్తిగా అటవీ వాతావరణంతో ఉంటుంది. కుమిలి నుంచి సుమారు 28 కిలోమీటర్లు, వండిపెరియార్‌ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో గవి ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు సుమారు 15–17 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 24–27 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటాయి.

సూర్యనెల్లి.. పొగమంచు, తేయాకు తోటల మధ్య..
ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్‌ పంచాయతీలో సూర్యనెల్లి ఉంది. మున్నార్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎత్తైన ప్రాంతం పొగమంచు, తేయాకు తోటలకు ప్రసిద్ధి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన తేయాకు తోటల్లో ఒకటిగా పేరున్న కొలుక్కుమలైకి ఇది ప్రవేశద్వారం. అక్కడి సూర్యోదయం, అనయిరంకల్‌ డ్యామ్‌ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.

పెరుగుతున్న వర్కేషన్‌ సంస్కృతి
రిమోట్‌ వర్క్‌తో పాటు వర్కేషన్‌ విధానం ప్రపంచంలోని పలు ప్రాంతాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. జపాన్‌ 2020లో జాతీయ పార్కులు, హాట్‌ స్ప్రింగ్‌ ప్రాంతాల్లో వై-ఫై, పని చేసుకునే ప్రదేశాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. బార్బడోస్‌ 2020లో విదేశీయులు ఏడాది వరకు అక్కడ ఉండి రిమోట్‌గా పనిచేసేలా ‘వెల్‌కమ్‌ స్టాంప్‌’ను తీసుకొచ్చింది. ఎస్టోనియా డిజిటల్‌ నోమాడ్‌ వీసాను ప్రవేశపెట్టిన తొలి దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇండోనేషియాలోని బాలీ కూడా రిమోట్‌ ఉద్యోగులకు ప్రముఖ గమ్యస్థానంగా మారింది.

ఇదీ చదవండి: జెన్‌ జెడ్‌ ‘బండ రాయి’ ట్రెండ్‌.. ఆన్‌లైన్‌లో ఉన్నా నో రిప్లై!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement