మధుర: ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ప్రేమానంద మహారాజ్ ఆశ్రమంలో ఓ శిష్యుడి మృతి దరిమిలా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేలీ కుంజ్ ఆశ్రమంలో దీక్ష కార్యక్రమాన్ని నిలిపివేశారు. టోకెన్ ద్వారా జరిగే దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. యమునా విహార్ కుంజ్ బెల్వాన్‌లో దీక్ష పొందిన భక్తులకు కల్పిస్తున్న దర్శన సౌకర్యాన్ని సైతం ఆపేశారు. ఆశ్రమ సేవాదారులు మైక్ ద్వారా భక్తులకు ఈ మార్పులను తెలియజేశారు. కేలీ కుంజ్ ఆశ్రమంలో కొత్త భక్తులకు దీక్ష ఇచ్చే కార్యక్రమాన్ని తాత్కలికంగా నిలిపివేశారు. ఈ నిర్ణయం ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనే దానిపై ఎలాంటి నిర్దిష్ట తేదీని ఆశ్రమం వెల్లడించలేదు.
ఆశ్రమంలో భక్తులకు అందుబాటులో ఉన్న టోకెన్ ఆధారిత దర్శన వ్యవస్థను కూడా నిలిపివేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ విధానంలో దర్శనాలకు వచ్చేవారు. ప్రస్తుతం టోకెన్ తీసుకుని గతంలో మాదిరిగా దర్శనం చేసుకునే అవకాశం ఉండదని ఆశ్రమ సేవాదారులు తెలిపారు. యమునా విహార్ కుంజ్ బెల్వాన్‌లో దీక్ష పొందిన భక్తులకు అందిస్తున్న దర్శన సౌకర్యాన్ని కూడా నిలిపివేశారు.
ప్రేమానంద మహారాజ్ శిష్యుడు రసిక్ దులారీ శరణ్, అలియాస్ దీపక్ లోధీ మృతి తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీపక్ మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందినవారు. అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు పైకప్పు నుంచి కింద పడినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు ముందు గదిలో ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు అపార్ట్‌మెంట్ డీవీఆర్, మొబైల్ ఫోన్, రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. మొబైల్‌లో తొలగించిన ఫొటోలు, చాట్స్ ద్వారా కూడా ఘటనకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆశ్రమంలో చేసిన మార్పుల ప్రభావం భక్తులపై పడుతోంది. దీక్ష తీసుకోవాలనుకున్నవారు ప్రస్తుతానికి వేచి ఉండాలి. టోకెన్ ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు కూడా ఆ సౌకర్యం అందుబాటులో లేదు. యమునా విహార్ కుంజ్ బెల్వాన్‌లో దీక్ష పొందిన భక్తుల దర్శనాలూ నిలిచిపోయాయి. దీక్ష ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుంది, టోకెన్ దర్శనాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, యమునా విహార్ కుంజ్‌లో దర్శనాలు ఎప్పటి నుంచి కొనసాగుతాయి అనే విషయాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ఇదీ చదవండి: భారతీయులతో పెళ్లయితే వీసా గ్యారెంటీ కాదు: కేరళ హైకోర్టు


