ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయన శిష్యుడు నాలుగో అంతస్తు నుంచి కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడిని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన దీపక్ లోధి అలియాస్ రసిక్ దులారీ శరణ్‌గా గుర్తించారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో గురు కృపా కుంజ్ ఆశ్రమం నాలుగో అంతస్తు నుంచి కిందపడినట్లు పోలీసులు తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఈ ఘటనలో దీపక్‌కు తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నాలుగో అంతస్తు నుంచి దూకి ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఆత్మహత్యకు కారణమేంటి?
దీపక్ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీపక్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఆశ్రమ నిర్వాహకులను కూడా విచారిస్తున్నారు. ఈ ఘటనపై ప్రేమానంద్ మహారాజ్ ఇప్పటివరకు స్పందించలేదు.
ఎవరీ ప్రేమానంద్ మహారాజ్?
ప్రేమానంద్ మహారాజ్ అసలు పేరు అనిరుద్ధ కుమార్ పాండే. ‘ప్రేమానంద్’ పేరుతో ఆధ్యాత్మిక బాట పట్టారు. తన ప్రసంగాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఆశ్రమానికి దేశ నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా వందలాది మంది భక్తులు హాజరవుతుంటారు.
ఇదీ చదవండి: రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం


