కల్తీ మద్యం కాటుకు 19 మంది బలి | 19 Dead After Consuming Illicit Liquor in Nagaland | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం కాటుకు 19 మంది బలి

Sep 26 2026 1:17 PM | Updated on Sep 26 2026 2:01 PM

19 Dead After Consuming Illicit Liquor in Nagaland

మోకోక్‌చుంగ్: నాగాలాండ్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కల్తీ చేసిన మద్యం తాగి.. రెండు జిల్లాల్లో రెండు రోజుల్లో 19 మంది మృతి చెందారు. ఈ ఘటనలపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, మద్యం సరఫరా దారులను పట్టుకునే పనిలో పడ్డారు. 3,000 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల వివరాల ప్రకారం.. మోకోక్‌చుంగ్ జిల్లాలో 8 మంది, ట్యూన్‌సాంగ్ జిల్లాలో 11 మంది కల్తీ మద్యం తాగిన తర్వాత మృతి చెందారు. ఈ మరణాలు గత రెండు రోజుల్లో చోటుచేసుకున్నాయి. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

ఈ ఘటనపై అదనపు ఎస్పీ ఐ బుంగ్‌లాంగ్ చాంగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీనియర్ ఎస్పీ వెసుప్రా కెజో తెలిపారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సరఫరా చేశారు? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సరఫరా వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని, అయితే ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించడం తొందరపాటు అవుతుందని పోలీసులు తెలిపారు.

మరణాలకు అసలు కారణాన్ని నిర్ధారించేందుకు మద్యం నమూనాలను గౌహతికి పంపించారు. అక్కడ ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత మృతుల మరణాలకు కల్తీ మద్యం కారణమైందా అనే అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరణాల నేపథ్యంలో నాగాలాండ్ పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 3,000 మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనుక ఉన్న సరఫరా నెట్‌వర్క్ ఏమిటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

నాగాలాండ్‌లో 1990 నుంచి మద్యనిషేధ చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గుర్తుతెలియని, లేబుల్ లేని లేదా అనుమానాస్పద మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సేవించవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. మద్యం సేవించిన తర్వాత తల తిరగడం, చూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సహాయం తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement