21 గంటల ఊరేగింపు.. కడలికేగిన లాల్‌బాగ్చా రాజా | Mumbai Bids Farewell to Lalbaugcha Raja After 21-Hour Procession | Sakshi
Sakshi News home page

21 గంటల ఊరేగింపు.. కడలికేగిన లాల్‌బాగ్చా రాజా

Sep 26 2026 12:20 PM | Updated on Sep 26 2026 12:43 PM

Mumbai Bids Farewell to Lalbaugcha Raja After 21-Hour Procession

ముంబై: మహానగరం ముంబైలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 12 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణపతి విగ్రహాలు శనివారం ఉదయం నిమజ్జనమయ్యాయి. లాల్‌బాగ్చా రాజా, చించ్‌పోక్లిచా చింతామణి వంటి ప్రసిద్ధ విగ్రహాలకు భక్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన నిమజ్జన ఊరేగింపులు రాత్రంతా కొనసాగి 21 గంటలకు పైగా సాగాయి.

అరేబియా సముద్రంలో లాల్‌బాగ్చా రాజా
భారీ భక్తజనం మధ్య లాల్‌బాగ్చా రాజా విగ్రహాన్ని శనివారం ఉదయం సుమారు 10.50 గంటలకు అరేబియా సముద్రంలో నిమజ్జనం చేశారు. సంప్రదాయ పూజలు, హారతి అనంతరం విగ్రహాన్ని బార్జ్‌పైకి తరలించారు. స్థానిక మత్స్యకారులు, భక్తుల సహకారంతో బార్జ్‌ను సముద్రంలోకి తీసుకెళ్లి నిమజ్జనం నిర్వహించారు.

బార్జ్‌పై అనంత్ అంబానీ
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ కూడా లాల్‌బాగ్చా రాజా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఆయన పలుమార్లు లాల్‌బాగ్‌చా రాజా మండపాన్ని సందర్శించారు. శనివారం నిమజ్జన ఊరేగింపులో పాల్గొని, విగ్రహాన్ని తీసుకెళ్లిన బార్జ్‌పై కూడా ఆయన ఉన్నారు.

చింతామణికి ఘన వీడ్కోలు
ముంబైలోని మరో ప్రముఖ గణపతి విగ్రహం చించ్‌పోక్లిచా చింతామణిని ఉదయం సుమారు 10 గంటలకు నిమజ్జనం చేశారు. అనంతరం లాల్‌బాగ్‌లోని బాల గణేశ్ మండల్‌కు చెందిన బల్లాళేశ్వర్ విగ్రహాన్ని సుమారు 11 గంటలకు నిమజ్జనం చేశారు. వీటిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

21 గంటలకు పైగా సాగిన ఊరేగింపులు
అనంత చతుర్దశి సందర్భంగా శుక్రవారం ఉదయం ముంబైలో గణపతి నిమజ్జన ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు విగ్రహాలతో కలిసి ఊరేగింపుల్లో పాల్గొన్నారు. రాత్రంతా కొనసాగిన ఈ ప్రక్రియ శనివారం ఉదయం వరకు సాగింది. నగరంలోని చాలా నిమజ్జన కార్యక్రమాలు పూర్తయినప్పటికీ, శనివారం మధ్యాహ్నం వరకు కొన్ని భారీ విగ్రహాలు నిమజ్జనం కోసం వేచి ఉన్నాయని అధికారులు తెలిపారు.

24 వేల మంది పోలీసులతో భద్రత
ముంబైలోని 67 సహజ నిమజ్జన ప్రదేశాలు, 383 కృత్రిమ చెరువుల్లో నిమజ్జనాలను సురక్షితంగా నిర్వహించేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 24 వేలకుపైగా ముంబై పోలీసులను మోహరించారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 25 వేల మంది సిబ్బందిని రంగంలోకి దించింది. లైఫ్‌గార్డులు, వైద్య బృందాలు, భారీ క్రేన్లను కూడా అందుబాటులో ఉంచారు.

నిమజ్జన ప్రదేశాల్లో శుభ్రత పనులు
12 రోజుల గణేశ్ ఉత్సవాలు ముగియడంతో నిమజ్జన ప్రదేశాలు, ప్రధాన ఊరేగింపు మార్గాల్లో పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రత పనులు ప్రారంభించారు. భారీ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కావడంతో ఏర్పడిన వ్యర్థాలను తొలగించే పనులు చేపట్టారు. 

ఇదీ చదవండి: మధుబాల రూ. 500 కానుక.. పూజారి సీన్‌ వైరల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement