చదువుతో మెదడుకు బూస్ట్.. వృద్ధాప్యంలోనూ లాభాలే! | Reading Linked to Better Brain Health Lower Dementia Risk | Sakshi
Sakshi News home page

చదువుతో మెదడుకు బూస్ట్.. వృద్ధాప్యంలోనూ లాభాలే!

Sep 26 2026 8:03 AM | Updated on Sep 26 2026 8:03 AM

Reading Linked to Better Brain Health Lower Dementia Risk

పుస్తకం చదవడం అంటే కేవలం కాలక్షేపం మాత్రమే కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చదివే అలవాటు అనేది మెరుగైన మానసిక ఆరోగ్యానికి, బలమైన జ్ఞాపకశక్తికి, మేధో సామర్థ్యాల పెంపుదలకు దోహదం చేయడంతో పాటు డిమెన్షియా(చిత్త వైకల్యం) ముప్పును తగ్గిస్తుందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.

చదువుతో మెదడుకు బలం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. చదవడం అనేది మెరుగైన మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది.  అయితే మనకు నచ్చిన విషయాన్ని ఆసక్తిగా చదవడమే ముఖ్యమని పరిశోధకులు తెలిపారు. ఈ అంశాలపై ప్రొఫెసర్ బార్బరా సహకియన్, డాక్టర్ క్రిస్టెల్ లాంగ్లీ సమీక్ష నిర్వహించారు. ‘సైకలాజికల్‌ మెడిసిన్‌’ లో ప్రచురితమైన ఈ సమీక్షలో.. పుస్తకాలు చదవడం వల్ల మెదడుకు ఆరోగ్యం, జ్ఞాన సామర్థ్యాల పెంపుదల తదితర ప్రయోజనాలు ఉండవచ్చని తెలిపారు.

చిన్నప్పటి నుంచే..
10 వేల మందికి పైగా యువతపై సహకియన్, లాంగ్లీ, వారి సహచరులు నిర్వహించిన ఒక అధ్యయనాన్ని పరిశోధకులు ప్రస్తావించారు. చిన్న వయసులోనే సరదాగా చదవడం ప్రారంభించిన పిల్లల్లో మెరుగైన శ్రద్ధ, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు కనిపించాయని తెలిపారు. అంతేకాకుండా వారి విద్యా ఫలితాలు మెరుగ్గా ఉండటంతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ చదివే అలవాటుకు సంబంధం ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. ఎక్కువ నిద్ర, తక్కువ స్క్రీన్ టైమ్ వంటి అలవాట్లు కూడా చదివే పిల్లల్లో కనిపించినట్లు తెలిపారు.

నచ్చిన పుస్తకంతో మొదలు పెట్టాలి
పిల్లలు, యువతలో చదివే అలవాటును పెంచేందుకు సాధ్యమైనంత ఎక్కువగా ప్రోత్సహించాలని డాక్టర్ క్రిస్టెల్ లాంగ్లీ సూచించారు. అయితే తప్పనిసరిగా నవలలతోనే చదవడం ప్రారంభించాల్సిన అవసరం లేదని చెప్పారు. పిల్లలకు నిజంగా ఆసక్తి కలిగించే అంశం ఏదైనా ఉంటే.. దానినే చదువుకు పరిచయ మార్గంగా ఉపయోగించుకోవచ్చన్నారు. టీవీ కార్యక్రమాలు లేదా ఆటలపై ఉన్న ఆసక్తిని కూడా చదవడం వైపు మళ్లించవచ్చని తెలిపారు. కామిక్స్, గ్రాఫిక్ నవలలు కూడా పిల్లలకు ప్రారంభ దశలో ఉపయోగపడొచ్చని పేర్కొన్నారు. అవి సాధారణ నవలలతో పోలిస్తే తక్కువ భయపెట్టేలా, ఆసక్తికరంగా అనిపించవచ్చని వివరించారు.

వృద్ధాప్యంలోనూ ప్రయోజనాలు
చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు చిన్నతనంతోనే ఆగిపోవని పరిశోధకులు స్పష్టం చేశారు. యుక్త వయసు నుంచి వృద్ధాప్యం వరకు చదివే అలవాటు కొనసాగించవచ్చని తెలిపారు. చదవడం అనేది జ్ఞాన సామర్థ్యాలను పెంపొందిస్తుందని, వయసుతో పాటు వచ్చే  మతిమరపును తగ్గిస్తుందని వివిధ అధ్యయనాలు తెలియజేశాయి. పరిశోధకుల తమ సమీక్షలో సర్వేలు, దీర్ఘకాలిక అధ్యయనాలు, మెదడుపై జరిగిన పరిశోధనలు, ప్రవర్తనా అధ్యయనాలు వంటి పలు రకాల పరిశోధనలను విశ్లేషించారు.

కలిసి చదవడంలో ప్రత్యేక ప్రయోజనాలు
ఒంటరిగా చదవడంతో పాటు ఇతరులతో కలిసి చదవడం, బుక్ క్లబ్‌లలో పాల్గొనడం వల్ల అదనపు సామాజిక ప్రయోజనాలు  ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒంటరితనాన్ని తగ్గించి, ఇతరులతో  కలసిపోయే భావనను  పెంపొందిస్తాయన్నారు. ఒంటరితనం తగ్గడం డిమెన్షియా ముప్పును తగ్గించడంలోనూ సహాయపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎక్కువగా బయటకు వెళ్లలేని వృద్ధులకు బుక్ క్లబ్‌లు ఉపయోగకరమని ప్రొఫెసర్ సహకియన్ తెలిపారు.

ఇదీ చదవండి: అమెరికా కోర్టులో ఆంత్రోపిక్‌కు ఎదురుదెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement