రేపు డాటర్స్ డే సందర్భంగా..
కూతురు పుట్టడం అంటే ఇంట్లో దీపం వెలగడం కాదు, ఇల్లే వెలుగైపోవడం. ఆమె నవ్వు వెలుగు, మాట వెలుగు, మనసు వెలుగు. కూతురు ఎదిగితే ఇల్లే ఎత్తుగా
నిలబడుతుంది. సవాళ్లు, అడ్డంకులు దాటి, కలలను అందుకుని ఈ రోజు కూతుళ్లు గర్వంగా తలెత్తుకుని నిలబడుతున్నారు. వారిని చూసి తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. ‘నా కూతురు’ అని లోకానికి గర్వంగా చూపుతున్నారు. ఆమెను ఆపకుండా, దాచకుండా, ఆమె వెలుతురును ప్రపంచానికి చూపించినప్పుడే
సమాజం నిజంగా వెలిగినట్లు. కూతురు వెలిగితేనే రేపటి తరం వెలుగుతుంది.
నాన్న నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్
– డాక్టర్ కావ్య, కార్డియాలజిస్ట్
(డాటర్ ఆఫ్ డాక్టర్ గురవారెడ్డి)నాన్న నా జీవితంలో చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పించారు. ముఖ్యంగా నేను డాక్టర్ (కార్డియాలజిస్ట్) అయ్యిందే మా అమ్మానాన్నలను చూసి. వాళ్లు ప్రజలకు ఎలా సేవ చేస్తున్నారనేది చూసి, వాళ్ల నుంచి స్ఫూర్తి పొంది... నేనూ వాళ్లలాగే చేయాలని డాక్టర్ అయ్యాను. ఒక డాక్టర్‌గా మీకు ఉన్న వైద్యపరిజ్ఞానం, మీ సర్జికల్ నైపుణ్యాలూ ఇవన్నీ సరే... ఓ పేషెంట్‌తో మానవీయంగా, సహానుభూతితో ఎలా మెలగాలి, వాళ్లను మన సొంత కుటుంబ సభ్యుడిగా ఎలా చూసుకోవాలనే పాఠాలు మా నాన్న నాకూ, మా అన్నకూ తరచూ చెబుతుంటారు. నేర్పుతుంటారు. పేషెంట్స్ ఎంతో భయంతో, ఆందోళనతో మన దగ్గరికి వస్తారు. వాళ్లలోని ఆ భయాన్ని పోగొట్టి, ధైర్యం నింపి, చికిత్సలెలా అందించాలన్న అంశాలకు ఆయన చాలా ప్రాముఖ్యమిస్తారు. అవే మాకూ బోధిస్తారు. ఆ విలువలను మాలోనూ నింపుతుంటారు. ఆయన స్ఫూర్తినే మేమూ మాలో నింపుకుని, కనీసం ఆయన దాంట్లో ఐదు శాతమైనా నా పేషెంట్స్‌కు అందజేయగలిగితే అదెంతో మేలు చేస్తుందని గుర్తించి, ఆ విలువలు పాటించడానికి అనుక్షణం ప్రయత్నిస్తుంటాను.
నాన్న ఎంత పెద్ద డాక్టరో, ఆయన మనసు ఎంత పెద్దదో ఈ ప్రపంచానికి తెలుసు. ఈ లోకంలోని ప్రతి ఒక్కరూ మంచివారే అన్నది ఆయన భావన. నాన్నది చాలా సింపుల్ ఫిలాసఫీ. ‘జీవితంలో ఎప్పుడూ సంతోషంగా... పాజిటివ్‌గా ఉండండి’ అని చెబుతుంటారు. ఆయనా దాన్నే నమ్ముతారూ, అనుసరిస్తారు. చాలా చిన్న విషయాలకూ ఎక్సైట్ అవుతుంటారు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే... బండి మీద మంచి జామపండ్లు కనిపించినా... తన జ్ఞాపకాల్లోకి జారిపోయి సంతోషపడుతుంటారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే అందరూ విసుక్కుంటారేమోగానీ... నాన్న ఆ టైమ్‌లో తన మనవలకూ, మనవరాళ్లకూ ఎలాంటి బొమ్మలు తీసుకుంటే బాగుంటుంది లాంటి ఆలోచనలు చేస్తుంటారు. డబ్బులకు పెద్దగా విలువివ్వరు. కానీ మనుషులకూ, బంధాలకూ, అనుబంధాలకూ, కుటుంబానికీ చాలా విలువనిస్తారు. మన దగ్గర ఎంతో పెద్ద మొత్తంలో ఉండే డబ్బుకన్నా, సంపద కన్నా ఈ చిన్న చిన్న విషయాల్లో దొరికే ఆనందాల విలువ చాలా ఎక్కువనే అంశాన్ని ఆయన నుంచే నేను నేర్చుకున్నా. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే... ఎంత విపత్కరమైన పరిస్థితి అయినా, విషమ స్థితి అయినా దాని పరిష్కారం వెదికి సాధిస్తారు. నా ఆరో తరగతి సమయంలో నాకు హిప్ ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడే నాన్న కళ్లలో నీళ్లు అనేవి మొదటిసారి చూశా. అయినప్పటికీ ఆయన ఎంతగానో కష్టపడి ఓ సర్జరీ చేయించి ఆ సమస్యను అధిగమించేలా చేశారు. నాన్నతో పాటు అమ్మా, అన్న తోడుగా నిలబడ్డారు. అందుకే ఓ దృఢమైన మనసుతో, సంకల్పంతో ఉండే నాన్న నాకు తోడుంటే నాకెంతో అండ ఉన్నట్లే. నేనివ్వాళ ఇద్దరు బిడ్డల తల్లిగా, ఓ కార్డియాలజిస్టుగా జీవితం సాగిస్తున్నానంటే అందుకు నాన్నకెంతో రుణపడి ఉన్నా.
నాన్నే కాదు... అమ్మ కూడా..!
– డాక్టర్ శ్రుతి వెన్నెల
డాక్టర్ సుధాకర్ పెద్దకూతురు
నేను ఒక పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ అనస్థిషియాలజిస్ట్‌ని. నా బాధ్యతలు చెప్పాలంటే చిన్నపిల్లల గుండె ఆపరేషన్లలోనూ, పెద్దల గుండె ఆపరేషన్ల విషయంలోనూ నేను ఆపరేషన్ థియేటర్‌లో నా సేవలందించాల్సి ఉంటుంది. ఇక పోస్ట్ ఆపరేటివ్ కేర్ విషయంలో పెద్దవారి గుండె సర్జరీ కేసుల్లో నా బాధ్యతలు ఆపరేషన్ తర్వాతా కొనసాగుతాయి. కానీ చిన్నపిల్లలకు మాత్రం పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఉంటారు.
నా అమ్మానాన్నలిద్దరూ డాక్టర్లే. నాన్న ఒక్కరి నుంచే స్ఫూర్తి దొరికిందంటే అమ్మ భూమికను కాస్త తక్కువ చేసినట్టవుతుందేమో! ఓ మంచి డాక్టర్ కావడంతో పాటు మా అమ్మ ఓ క్రీడాకారిణి (అథ్లెట్) కావడమూ, ఓ మొక్కల సంరక్షకురాలు కావడం వంటి అనేక నైపుణ్యాలు కలగలసిన మహిళ. ఆ ఇద్దరి నుంచీ పొందిన స్ఫూర్తే... నేనూ డాక్టర్ అయ్యేలా చేసింది. ఇక నాన్న నుంచి నేర్చుకున్నదేమిటంటే... ఆయన పొద్దున్నే 7 గంటలకల్లా హాస్పిటల్‌కు వెళ్తారు. రాత్రి ఇంటికొచ్చేసరికి ఒక్కోసారి రాత్రి ఒంటిగంటా, రెండవుతుంది కూడా. అంతలా ఆయన తన పేషెంట్స్ పట్ల శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాదు... ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాన్సర్ వ్యాధుల పట్ల సేవలు పొందలేని చిన్నారుల కోసం ఆయన అప్పటి కలెక్టర్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ తన సేవలందించేందుకు ముందుకొచ్చారు. పేదల సేవల పట్ల ఇలాంటి ΄్యాషన్‌ను నా తండ్రి నుంచి నేర్చుకున్నా. ఇప్పుడున్న చైతన్యం, గూగుల్, ఏఐ లాంటి సౌకర్యాల వల్ల మొదట్లో కంటే ఇప్పుడు పేషెంట్స్‌లోనూ వైద్యపరిజ్ఞానం పట్ల చాలా అవగాహన పెరిగింది. నా చిన్నప్పటి రోజుల్లో వైద్యుల పట్ల చాలా గాఢమైన నమ్మకం ఉండేది. ఒక రకంగా చూస్తే అది మంచిది కూడా.
నాన్నని చూస్తూ పెరిగాం...
– చిన్న కూతురు డాక్టర్ సాహితీ తేజ
కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్
చిన్నప్పుడు నా ఊహ తెలిసిన నాటి నుంచీ మేం నిద్రలేచే టైముకే నాన్న మా ఇంట్లోనే ఓ క్లినిక్ లాంటిది ఏర్పాటు చేసుకుని పేషెంట్స్‌ను చూస్తుండేవారు. ఆ తర్వాత తొమ్మిదికల్లా హాస్పిటల్‌కు వెళ్లేవారు. ఆయన పేషెంట్స్‌కు సేవలందిస్తున్న టైమ్‌లోనే ఆయనకు గుడ్ మార్నింగ్ చెబుతూ స్కూలుకెళ్లేవాళ్లమా... అలా స్కూల్ నుంచి వచ్చే టైముకు ఆయన పేషెంట్స్‌కు సేవలందిస్తూనే మాకు మళ్లీ మాకు కనిపించేవారు. ఇలా ఆయననెప్పుడూ ఎదుటివారి అనారోగ్యాలూ, బాధలను తొలగిస్తూ ఉండే పనిలో నిమగ్నమై ఉండటాన్నే మేము చూస్తూ ఉండేవాళ్లం. ఇక పేషెంట్స్ బాగైపోయాక వాళ్లు మా అమ్మానాన్నలకు కృతజ్ఞతలు చెప్పే తీరూ, వాళ్ల అభిమానాన్ని వ్యక్తీకరించే తీరు.. అమ్మగురించీ, నాన్న గురించీ గొప్పగా మాట్లాడే విధానం... ఇవన్నీ మాకు నచ్చాయి. అమ్మానాన్నలెప్పుడూ మమ్మల్ని డాక్టర్ అవమని అడగకపోయినా... ఈ అంశాలన్నీ మాకు తెలియకుండానే మమ్మల్ని వైద్యం వైపు నడిపించాయి.
చాలా దూర్రపాంతాలనుంచీ, చాలా వెనకబడిన ప్రాంతాలనుంచీ, చాలా చాలా పేద కుటుంబాల నుంచీ పేషెంట్స్ నాన్న కోసం వచ్చేవారు. కొందరైతే తాము ఫీజు చెల్లించలేమని చెప్పేసేవారు. అయితే మీ ఫీజు కంటే ముందుగా మీరు బాగవ్వడం ముఖ్యమనేవారు నాన్న. ఒక్కోసారి ఆ టైముకు ఆయన హాస్పిటల్‌కు వెళ్తుంటే... ఆ పేషెంట్స్‌నూ తన కార్‌లోనే బస్‌స్టాండ్ దగ్గర దింపేసేవారు. డబ్బు కంటే పిల్లలకు బాగవ్వడమే నాకు చాలా ముఖ్యం అనే ధోరణి నాన్నది. మాకూ అదే చెప్పేవారు. అమ్మానాన్న తాలూకు ఆ విలువలనూ మేము కూడా మా జీవితాల్లో పెంపొందించుకున్నాం. పెద్దల కంటే కూడా చిన్నారులకు ఏదైనా అయితే తల్లిదండ్రులు విలవిలలాడిపోతుంటారు. తమ పిల్లలకు ఎదైనా సమస్య ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల బాధలు చూసినప్పుడు నాన్న ఓ డాక్టర్‌గా కంటే ఒక్కోసారి ఓ తండ్రిలా, మానవీయమైన వ్యక్తిలా వ్యవహరిస్తారు. ఈ ఎమోషనల్ అంశాలు కూడా మేము పేషెంట్స్ పట్ల మరింత సహానుభూతి తో చికిత్సలందించేలా మమ్మల్ని పురిగొల్పాయని చెప్పగలం.
వాళ్ల ఎచీవ్‌మెంట్సే మా సంతోషం
డాక్టర్ జి. సుధాకర్, డాక్టర్ జి. శారద,చిన్నపిల్లల నిపుణులు, కర్నూలు
మా అమ్మాయిలు మాకెంతో గర్వకారణం. వాళ్లు డాక్టర్లే కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. కెరియర్‌లో ఉండే అనేక అవకాశాల గురించి వాళ్లకు విపులంగా చెప్పాం. డాక్టర్ కావాలన్నది వాళ్ల విష్ మాత్రమే. నా పెద్ద కూతురు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీలకూ, పెద్దలకు చేసే గుండె అపరేషన్లలో అనస్థీషియా అందించే స్పెషాలిటీలో ఉంది. తన భర్త డా. కిరణ్‌కుమార్ కూడా డాక్టరే. ఆయన ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, ఆర్థోస్కోపీ అండ్ ట్రామా స్పెషలిస్ట్. అలాగే నా చిన్నకూతురు కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. తన భర్త డా. ఫణి భూషణ్ కన్సల్టెంట్ నియోనేటాలజిస్ట్. అంటే... వాళ్లిద్దరిదీ దాదాపుగా ఒకేలాంటి ఫీల్డ్. మా కూతుళ్లను మేం డాక్టర్‌లుగా కంటే మంచి మానవీయ విలువలున్న వ్యక్తులుగా పెంచాం. వాళ్ల అచీవ్‌మెంట్స్‌తో మాకెప్పుడూ ఆనందంగా ఉంటుంది. నిజానికి ఇది మాటల్లో చెప్పడం కంటే ఆ అనుభూతే అద్భుతంగా ఉంటుందని చెప్పగలం.
అమ్మనుచూసీ చూసీ...
– డాక్టర్ దీప్తి సురేఖ, కన్సల్టెంట్ ఉమన్ యూరాలజిస్ట్
మా అమ్మ నిర్మల గైనకాలజిస్ట్. మా ఇంట్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. అక్క, బావ ఇద్దరూ పీడియాట్రీషియన్స్, చెల్లి గైనకాలజిస్ట్. ఇలా కుటుంబంలో చాలామంది డాక్టర్లు ఉండటం... అలాగే అమ్మ అప్పట్లో తన హాస్పిటల్ (నవ్య హాస్పిటల్) లో తన పేషెంట్స్‌కు సేవలందిస్తూ ఉండటం, మేం స్కూల్ నుంచి వచ్చేటప్పటికే ఆఖరికి ఆదివారం నాడు కూడా ఎప్పుడూ అమ్మ తన పేషెంట్స్ పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉండటం చూసేదాన్ని. అలాగే ఆమె రౌండ్స్‌కు వెళ్తున్నప్పుడు ఆమెతో పాటు వెళ్తూ... పేషెంట్స్‌తోనూ, వాళ్ల అటెండెంట్స్‌తో అమ్మ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారో చూస్తూ ఉండేదాన్ని. చిన్నప్పుడు నేను యాక్టింగ్ లాంటి కో–కరిక్యులార్ యాక్టివిటీస్‌లో కూడా చాలా చురుగ్గా ఉండేదాన్ని. బహుశా అందుకేనేమో... అప్పట్లో నేను డాక్టర్ అవుతానని కూడా ఇంట్లోవాళ్లు అనుకోలేదు. నా చిన్నప్పుడు అమ్మా నాన్న ఎప్పుడూ ‘నువ్వు ఫలానా కెరియర్‌నే ఎంచుకోవాలం’టూ ఎప్పుడూ చెప్పలేదు కూడా. అయితే నేను పదోతరగతి తర్వాత డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పగానే ఇంట్లోవాళ్లు చాలా ఆశ్చర్యపడ్డారు కూడా. అయితే నేను డాక్టర్ అవ్వడంలో అమ్మ నుంచి పొందిన స్ఫూర్తిదే చాలా ఎక్కువ భూమిక అనుకుంటా. ఎందుకంటే పేషెంట్స్ సమస్య చిన్నదో, పెద్దదో కావచ్చుగానీ... వాళ్లను తానున్నానంటూ అమ్మ ఇచ్చే భరోసా... అటు తర్వాత వాళ్లు బాగైపోయినప్పుడు వాళ్లు వెల్లడించే కృతజ్ఞతా ‘మీ అమ్మగారు ఎంత మంచి మనిషీ, ఎంత మంచి డాక్టర్’ అంటూ వాళ్ల మెచ్చికోళ్లూ...ఇలా సమాజం కోసం అమ్మ తన వంతుగా ఏదో చేస్తున్నారనే భావన... ఇవన్నీ పరోక్షంగానే నేనూ డాక్టర్ అయ్యేలా చేశాయి. ఇక ఎంబీబీఎస్‌లో చేరాక థియరీ ఎలా రాయాలీ, వైవా ఎలా ఎదుర్కోవాలి లాంటి అనేక విషయాల్ల అమ్మ ఇచ్చే సూచనలు... ఇవన్నీ నాకు బాగా ఉపకరించాయి. ఇలా ఎంబీబీఎస్ నుంచి ఎమ్‌సీహెచ్ యూరాలజీ వరకు అమ్మ ప్రోత్సాహం కొనసాగింది.
ప్రకృతి దీవెన... నా కూతురు!
నేను లైఫ్‌లో రెండే రెండు కోరికలు కోరుకున్నా. మొదటిది ‘డాక్టర్’ కావాలనుకున్నా. రెండోది ‘డాటర్’ కావాలనుకున్నా. ఎందుకో తెలియదు... లివర్‌పూల్ (ఇంగ్లాండ్)లో కావ్య పుట్టినరోజున నా ఆనందానికి అవధుల్లేవు. నా జీవితంలో డిప్రెషన్ తో ఉన్న రోజులు చాలా అరుదు. అది నా కూతురు ఒంట్లో బాగాలేనప్పుడే. తాను చక్కగా చదువుకుని, కార్డియాలజిస్ట్ అయి పేషెంట్స్‌ను ట్రీట్ చేయడం చూసి సంతోషంగా ఉంది. తన పిల్లలకు సమయాన్ని కేటాయిస్తున్న తీరు చాలా ముచ్చటగా ఉంటుంది. తనకు పేరు పెట్టడం ఒక్కటే నా ఎంపిక. చదువు, కెరీర్ అన్నీ తన ఇష్టాలే. చివరికి తన భర్తను తానే ఎంచుకుని నాకు ఏమాత్రం శ్రమ ఇవ్వకుండా అల్లుడిని తెచ్చిపెట్టింది. ఎంతో బాధ్యతగా, ఉదాత్తంగా ఉంటుంది. పెద్దలు ఏమంటారంటే... రాయిలాంటి కొడుకును ఉలితో చెక్కి తీర్చిదిద్దుకోవచ్చుగానీ...పువ్వులాంటì కూతురును చాలా సున్నితంగా చూసుకోవాలంటారు. నాకు ప్రకృతి ఇచ్చిన దీవెన... నా కూతురు!
– డాక్టర్ గురవారెడ్డి, ప్రముఖ వైద్యులు
నిర్వహణ: యాసీన్


