కోర్టులో కుటుంబ వివాదంపై విచారణ జరుగుతోంది.. తండ్రి వాంగ్మూలం పూర్తయింది.. అంతా సవ్యంగానే ఉందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత! కోర్టు గది నుంచి బయటకు వచ్చిన మహిళపై ఆమె భర్తతో పాటు మరో ఇద్దరు దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అడ్డుకోబోయిన తండ్రి, సోదరిపైనా దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌ను బాధితురాలు పోలీసులకు అందించింది.
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ కుటుంబ న్యాయస్థానంలో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు ప్రియా త్రిపాఠి ఫిర్యాదులో పేర్కొంది. పురందర్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సమర్ధీరా చౌరాహాకు చెందిన ప్రియాకు.. బృజ్‌మంజ్‌గంజ్ ప్రాంతంలోని కోయిలాడాడ్‌కు చెందిన మనీష్ కుమార్ మిశ్రాతో వివాహమైంది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భరణం కోసం ప్రియా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసు నంబర్ 641/2025తో విచారణ కొనసాగుతోంది.
తండ్రి వాంగ్మూలం తర్వాతే..
సెప్టెంబర్ 24న కేసు విచారణకు హాజరైన ప్రియా.. తన తండ్రి లక్ష్మీకాంత్, సోదరి ప్రియాంకతో కలిసి కోర్టుకు వెళ్లింది. తండ్రి వాంగ్మూలం పూర్తైన తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముగ్గురూ కోర్టు గది నుంచి బయటకు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ హాల్‌లోకి వచ్చినట్లు ఆమె తెలిపింది. అదే సమయంలో తన భర్త మనీష్ మిశ్రాతో పాటు ప్రిన్స్ మిశ్రా, సతీష్ మిశ్రా అక్కడికి వచ్చారని.. ముగ్గురూ కలిసి తనపై దాడి చేశారని ప్రియా ఆరోపించింది. తనను కొట్టడంతో పాటు గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారని పేర్కొంది.
Inside court premises in Maharajganj, Uttar Pradesh. Women were beaten and tossed like an object infront of police and lawyers. pic.twitter.com/g3mZBkNSuK
— Piyush Rai (@Benarasiyaa) September 26, 2026
అడ్డుకోబోయిన వారిపైనా దాడి?
ప్రియాపై దాడిని అడ్డుకునేందుకు ఆమె తండ్రి, సోదరి ప్రయత్నించగా.. వారిపైనా నిందితులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. వారిని కింద పడేసి గొంతు నులిమేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. కచేరీ ప్రాంగణంలో ఒక్కసారిగా గొడవ జరగడంతో అక్కడున్న పోలీసులకు విషయం తెలియగా.. వారు వెంటనే అక్కడికి చేరుకుని జోక్యం చేసుకున్నారని తెలిపింది. పోలీసులు రావడంతో ముగ్గురూ అక్కడి నుంచి వెళ్లిపోయారని.. అయితే వెళ్లే సమయంలో కేసు విషయంలో కోర్టులో వాదనలు కొనసాగిస్తే చంపేస్తామని బెదిరించారని ప్రియా ఆరోపించింది.
వీడియోతో పోలీసుల ముందుకు..
తనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా తన వద్ద ఉందని తెలిపిన ప్రియా.. దాన్ని పోలీసులకు అందించినట్లు పేర్కొంది. భర్త మనీష్ మిశ్రా, ప్రిన్స్ మిశ్రా, సతీష్ మిశ్రాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరింది. కోర్టు ప్రాంగణంలోనే మహిళపై దాడి జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు అందించిన వీడియో, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పోలీసులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.


