కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారం.. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఆ పార్టీలు గళం వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయంగా బద్ధ విరోధులైన టీఎంసీ, వామపక్షాలు సీఈసీ విషయంలో ఒక్కతాటిపైకి వస్తున్న వేళ.. ఆ రాష్ట్ర అధికార పార్టీ మాత్రం జ్ఞానేశ్ కుమార్‌కు పద్మ అవార్డు ఇవ్వడం సరైందని అంటోంది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు మద్దతుగా నిలిచారు. బెంగాల్‌లో ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంతోపాటు ఓటర్ల జాబితా ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నందుకు ఆయనకు కనీసం పద్మ భూషణ్ పురస్కారం ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలను భయపెట్టే ఘటనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి కల్పించడంలో జ్ఞానేశ్ కుమార్ కీలక పాత్ర పోషించారని అన్నారు. గతంలో రాష్ట్రంలో ఇలాంటి ప్రశాంతమైన ఎన్నికలను ప్రజలు అరుదుగా చూశారని పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్‌కు బెంగాల్ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
అక్రమంగా దేశంలోకి వచ్చిన బంగ్లాదేశీయుల పేర్లను పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు జ్ఞానేశ్ కుమార్ చర్యలు తీసుకున్నారని సమిక్ భట్టాచార్య పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను ప్రస్తావిస్తూ.. ఓటర్ల జాబితాను ‘ప్రక్షాళన’ చేయడంలో సీఈసీ కీలకంగా వ్యవహరించారని అన్నారు.
మరోవైపు ఆగ్రహం
జ్ఞానేశ్ కుమార్‌కు బీజేపీ నేత మద్దతు ప్రకటించిన సమయంలోనే.. మరోవైపు ఎన్నికల సంఘం పనితీరుపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్నాయి. సీఈసీ పోస్టుకు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తమకు తెలియకుండానే తమ పేర్లతో తీసుకున్నారంటూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికలు ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టగా.. జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని సీపీజే డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగియనుంది. అయితే ఎన్నికల కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం అంటే ఆ సంస్థ ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తోందనడానికి నిదర్శనమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అంటున్నారు.
సుప్రీంకోర్టులోనూ పిటిషన్
కేంద్ర ఎన్నికల సంఘం తాజా పరిణామాలపై ఇప్పటికే సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. సోమవారం అది విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాల మధ్యే.. జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తప్పుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, ఇటు అధికార బీజేపీ మాత్రం మద్దతుగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: ఆయనకు ఢిల్లీని ఏలే సీన్ ఉందా?


