అమెరికా కోర్టులో ఆంత్రోపిక్‌కు ఎదురుదెబ్బ | US Court Backs Pentagons Decision to Exclude Anthropic Over Claude AI Restrictions | Sakshi
Sakshi News home page

అమెరికా కోర్టులో ఆంత్రోపిక్‌కు ఎదురుదెబ్బ

Sep 26 2026 6:57 AM | Updated on Sep 26 2026 7:06 AM

US Court Backs Pentagons Decision to Exclude Anthropic Over Claude AI Restrictions

వాషింగ్టన్‌: అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ తీసుకున్న కీలక నిర్ణయానికి అప్పీల్ కోర్టు మద్దతు తెలిపింది. క్లాడ్‌ఏఐ వినియోగంపై కొన్ని భద్రతా పరిమితులను తొలగించేందుకు నిరాకరించిన కారణంగా ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌ను పెంటగాన్ సరఫరా వ్యవస్థ నుంచి తొలగించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేసిన ఆంత్రోపిక్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆంత్రోపిక్ తన క్లాడ్‌ ఏఐను పూర్తిగా స్వయంప్రతిపత్తితో పనిచేసే ప్రాణాంతక ఆయుధాల్లో, అలాగే అమెరికన్లపై భారీ స్థాయి దేశీయ నిఘాలో ఉపయోగించేందుకు అనుమతించేలా భద్రతా పరిమితులను తొలగించేందుకు నిరాకరించింది. ఈ వివాదం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. మార్చిలో పెంటగాన్ ఆ సంస్థను ‘సప్లై చైన్ రిస్క్’గా ప్రకటించి, దాని సైనిక ఒప్పందాలను రద్దు చేసింది.

సైనిక ఆపరేషన్‌లో పెంటగాన్ కాంట్రాక్టర్ పాలంటీర్‌ క్లాడ్‌  వినియోగించడంపై ఆంత్రోపిక్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కోర్టు తీర్పులో వెల్లడైంది. సైనిక వ్యవహారాల్లో ఏఐ వినియోగం వల్ల సాఫ్ట్‌వేర్ అనుకోని విధంగా పనిచేసే ప్రమాదం ఉందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆంత్రోపిక్ తన ఏఐ మోడళ్లను సైన్యానికి అందించిన తర్వాత వాటి ప్రవర్తనను మార్చలేమని వాదించింది. అయితే కొత్త వెర్షన్లను ఉపయోగించేందుకు సైన్యం తన వ్యవస్థలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ప్రమాదాలను ఎలా సమతుల్యం చేయాలనే విషయాన్ని అధ్యక్షుడు, రక్షణ కార్యదర్శే నిర్ణయించాల్సి ఉంటుందని న్యాయమూర్తి గ్రెగరీ కాట్సాస్ అభిప్రాయపడ్డారు.

ఆంత్రోపిక్‌తో వివాదం తర్వాత పెంటగాన్ ఇతర ఏఐ సంస్థల వైపు దృష్టి మళ్లించింది. చాట్‌జీపీటీ అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ కూడా ఒప్పందం చేసుకోగా, ఆ తర్వాత గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు కూడా పెంటగాన్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల విలువ ఉన్న ఆంత్రోపిక్ ప్రస్తుతం పెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఏఐ ప్రమాదాలపై ఆ సంస్థ సీఈవో డారియో అమోడెయి చేసిన హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో విమర్శించారు. పెంటగాన్ అధికారి ఎమిల్ మైఖేల్ కోర్టు తీర్పును స్వాగతించారు. ప్రైవేటు సంస్థలు సైనిక కమాండ్ వ్యవస్థలో తమ అభిప్రాయాలను చొప్పించకుండా ఈ తీర్పు రక్షణ కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆంత్రోపిక్ మాత్రం ఈ తీర్పుతో ఏకీభవించలేదు. తదుపరి న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: నేపాల్‌ వరదలు.. ఇప్పటికీ ఆచూకీలేని 800 మంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement