సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సీఐ నాగరాజుకు రెండో ఏజేఎంఎఫ్‌సీ కోర్టు షాక్ ఇచ్చింది. డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు నాగరాజు అర్హుడు కాదని కోర్టు తేల్చి చెప్పింది. సిట్ అసంపూర్తిగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని సీఐ నాగరాజు కోరగా.. బెయిల్ పొందేందుకు నాగరాజు అర్హుడు కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. డిఫాల్ట్ బెయిల్‌పై ఇవాళ(శుక్రవారం) కోర్టులో వాదనలు ముగిశాయి. డిఫాల్ట్ బెయిల్ డిస్మిస్ చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.
కాగా, సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌కు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి హైకోర్టు ముందున్న వ్యాజ్యాలపై తీర్పు వెలువడిన అనంతరం, అవసరమైతే ఈ అంశంపై జోక్యం చేసుకుంటామని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో అసలు దోషులు, ఉన్నతాధికారుల పాత్రను తేల్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.
‘ఏపీ హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ ముగింపు దశలో ఉంది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడడం సబబు’ అని వ్యాఖ్యానించింది. అంతక్రితం విచారణ ప్రారంభమైన వెంటనే పిటిషనర్ గురుమూర్తి తరఫున సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్, న్యాయవాదులు అల్లంకి రమేష్, రాళ్ల మమత వాదనలు వినిపిస్తూ, ఈ కేసుకు సంబంధించిన పరిణామాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సాయికృష్ణ కనిపించకపోవడంపై తల్లి దాఖలుచేసిన హెబియస్ కార్పస్, అలాగే కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం


