సాక్షి, తాడేపల్లి: తమపై అక్రమ కేసులకు నిరసనగా రేపు(శనివారం) సీపీని కలుస్తాం.. అక్రమ కేసులపై ప్రశ్నిస్తామని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలో చొరబడతారా? అంటూ దుయ్యబట్టారు. జైల్లో ఉంచటానికి అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. నారా లోకేష్ పెత్తనంలో పోలీసులు వైఖరి ఇలా ఉంది’’ అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అసలు ఈ సెక్షన్లు ఎలా పెడతారని కోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వ లాయరు దగ్గర సమాధానం లేదు. వైఎస్సార్‌సీపీ నేతలందరిపై రౌడీముద్ర వేయాలని చూస్తున్నారు. కాదంబరి జత్వానీ కేసులో కూడా పోలీసులు దగ్గరుండి దుర్గగుడికి తీసుకెళ్లారు. ఇప్పుడు దొంగ టీచర్లను కూడా అలాగే దుర్గ గుడికి తీసుకెళ్లి దర్శనం చేయించారు. అప్పుడు జత్వానీనీ, ఇప్పుడు దొంగ టీచర్లను కాక పడుతున్నారు. కానీ ఈ కేసులు ఏవీ నిలబడవు’’ అని అంబటి వ్యాఖ్యానించారు.
‘‘కాకుమాను రాజశేఖర్ మృతికి పోలీసుల వైఖరే కారణం. శాప్ ఎదుట ధర్నాలో పాల్గొన్న రాజశేఖర్‌పై పోలీసులు దాడి చేశారు. రౌడీషీట్లు ఇష్టానుసారం ఓపెన్ చేయటం సిగ్గుచేటు. ఈడీ కేసులకు భయపడను. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తాను. ఎల్లోమీడియాలో ఊహా కథనాలు రాస్తున్నారు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: సాయం అంటే ఇది.. థాంక్యూ జగన్ మామయ్య


