టైటిల్ : ది ప్యారడైజ్
నటీనటులు: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు
నిర్మాణ సంస్థ: SLV సినిమాస్
నిర్మాత: చెరుకూరి సుధాకర్
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: సిహెచ్ సాయి
ఎడిటింగ్: నవీన్ నూలి
విడుదల తేది: సెప్టెంబర్ 24, 2026
ఒకప్పుడు నాని అంటే క్లాస్ ఎంటర్‌టైనింగ్ సినిమాలు గుర్తొచ్చేవి. పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో అలరించేవాడు. కానీ ‘దసరా’తో తన రూట్ మార్చాడు. మాస్ యాక్షన్ సినిమా చేస్తూ తనలోని వయెలెంట్ యాంగిల్‌ని చూపిస్తున్నాడు. అలా ఇప్పటి వరకు చూడని మాస్ అవతారంతో ‘ది ప్యారడైజ్'అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల రిలీజ్ అయిన పాటలు, టీజర్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఇలా భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నాని చేసిన మాస్ ప్రయోగం ఫలించిందా? శ్రీకాంత్ ఓదెల మరోసారి తన మార్క్ చూపించాడా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథ 1947లొ మొదలై 80లలొ ముగుస్తుంది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా..హైదరాబాద్‌లోని ప్యారడైజ్ ప్రాంతం మాత్రం సంపన్న వర్గానికి చెందిన శికంజ మాలిక్(మోహన్ బాబు) ఆధీనంలో ఉంటుంది. అక్కడ నివసించే సవారీ జాతి వాళ్లకు గుర్తింపు ఉండదు. తమను భారతీయులుగా గుర్తించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆ జాతికి చెందిన సమ్మక్క(సోనాలి కులకర్ణి).. శికంజ మాలిక్‌కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటారు. ఆమె కొడుకే జడల్(నాని). చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనతో మాలిక్‌తో పాటు తల్లిపై కూడా కోపం పెంచుకుంటాడు. హత్యానేరంపై జైలుకెళ్లి 14 ఏళ్ల తర్వాత తిరిగివస్తాడు. శికంజ మాలిక్‌ని చంపడమే తన లక్ష్యం. మరి తన లక్ష్యం నెరవేరిందా? ప్యారడైజ్‌లో శికంజ మాలిక్ కొడుకు(రాఘవ్ జుయల్)సృష్టించిన విధ్వంసం ఏంటి? అసలు జడల్..తన తల్లిపట్ల ఎందుకు కోపంగా ఉన్నాడు? గుర్తింపు కోసం తన తల్లి చేస్తున్న పోరాటాన్ని ఎప్పుడు అర్థం చేసుకున్నాడు? తల్లి చేస్తున్న ఈ పోరాటంలోకి జడల్ ఎలా వచ్చాడు? చివరకు సవారీలకు గుర్తింపు వచ్చిందా రాలేదా? ఈ కథలో బిర్యానీ(సంపూర్ణేష్ బాబు), సుబ్బు(కయాదు లోహర్) పాత్రలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ మధ్యకాలంలో ది ప్యారడైజ్ సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకూ రాలేదనే చెప్పాలి. టీజర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి అమాంతం పెరిగింది. అయితే కొండంత రాగం తీసి.. ఏదో పాట పాడినట్టు ఆ స్థాయి అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది.
ది ప్యారడైజ్ కథలో కొత్తదనం కనిపించదు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు కోసం ఓ వర్గం చేసే పోరాటం.. ఆ వర్గాన్ని ఓ బలమైన వ్యక్తి అణచివేయడం.. ఆ అణచివేత నుంచి ఓ కథానాయకుడు ఎదగడం.. చివరకు తన వర్గానికి గుర్తింపు తీసుకురావడం.. ఈ తరహా కథలు తెలుగు తెరపై చాలానే చూశాం. పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా కథలో కొత్తదనం లేకపోయినా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనదైన ట్రీట్‌మెంట్‌తో దానికి కొత్త రూపు ఇవ్వాలని ప్రయత్నించాడు. కథలోని ప్రపంచాన్ని, పాత్రలను, అక్కడి పరిస్థితులను ఆయన నిర్మించిన విధానం బాగుంది కానీ.. అయితే ముఖ్యమైన ఎమోషన్ మిస్సయింది.
ధురంధర్ తరహాలో ఈ సినిమాను చాప్టర్లుగా విభజిస్తూ కథనాన్ని ముందుకు నడిపాడు. మొత్తం 6 చాప్టర్లు ఉంటాయి. అందులో మొదటి చాప్టర్‌లో సవారీ జాతి నేపథ్యాన్ని,అణచివేతకు గురైన తీరుని చూపించారు. ఇది కొంతవరకు ఆసక్తికరంగానే సాగుతుంది. ఇక రెండో చాప్టర్‌లో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే ఆమె తండ్రిపై ప్రేమలో చేసే ఒక పని..లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్‌గానూ అంతగా ఆకట్టుకోలేదు.
చాప్టర్ 3లో మదర్ సెంటిమెంట్‌ని చూపించారు. ఒకవైపు కథను ఎమోషనల్‌గా నడిపిస్తూనే మరోవైపు శృతిమించిన వయెలెన్స్‌ని చూపించారు. సినిమా ప్రారంభం నుంచే రక్తం ఏరులైపారుతుంది. తలలు ఎగిరిపడుతుంటాయి. రక్తపు మడుగులో బొర్లుతుంటారు. అయినప్పటీకీ ఆయా సీన్లు అంతగా ఆకట్టుకోలేవు. ఇంటర్వెల్ సినిమా మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిన పెంచుతుంది. ఫస్టాఫ్ చూసిన తర్వాత ఇంకేదో ఉంటుదని..ఇప్పుడు ఏదో మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇక ద్వితియార్థంలో కథనం చాలావరకు గాడీ తప్పింది. చెప్పడానికి కథ పెద్దగా లేకపోవడంతో చాలా వరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎమ్మెల్యే శంకర్‌రావు( కేసీఆర్‌ను పోలిన పాత్ర) ఎపిసోడ్ మాత్రం థియేటర్స్‌లో ఈళలు వేయిస్తుంది. అయితే ఆ కథకు ఆ పాత్రకు పెద్దగా సంబంధం ఉండదు. ఆ తర్వాత కథను ఎమోషనల్‌గా నడిపించే అవకాశం ఉన్నా..మళ్లీ నరుకుడు పద్దతినే ఎంచుకున్నాడు దర్శకుడు. విపరీతమైన హింస సన్నివేశాలను జోడించాడు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గానే ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
జడల్ జమానా పాత్రలో నాని జీవించేశాడు. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. తన శక్తికి మించిన పాత్రను చేసి మెప్పించే ప్రయత్నం చేశాడు. నాని కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక 'శికంజ మాలిక్' పాత్రలో మోహన్ బాబు తనదైన గాంభీర్యం, డైలాగ్ డెలివరీతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమాకు ప్లస్ అయింది. చాలా కాలం తర్వాత మోహన్ బాబు ఇలాంటి పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇక శికంజ మాలిక్ కొడుకుగా రాఘవ్ జుయల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కయాదు లోహర్ పాత్ర నిడివి తక్కువే అయినా గుర్తిండిపోయే పాత్ర చేసింది. ఇక హీరో తల్లి సమ్మక్కగా సోనాలి కులకర్ణి తనదైన నటనతో ఆకట్టుకుంది. సంపూర్ణేష్ బాబు కొత్త తరహా పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు.అయితే దర్శకుడు అతన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడనిపిస్తుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. యాక్షన్ సీన్స్‌కి ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్. ఇక పాటల గురించి తెలిసిందే. రిలీజ్‌కి ముందే సూపర్ హిట్ అయ్యాయి. ఏష నాగుల పాటలకి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. మిగిలిన పాటలన్నీ ఆకట్టుకునేలానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు అద్భుతంగా ఉంది. ప్యారడైజ్ వరల్డ్‌ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


