IIT Student Death: నిరాహార దీక్షకు తండ్రి హెచ్చరిక | IIT Bombay Student Death: Father Threatens Hunger Strike Over Arrests | Sakshi
Sakshi News home page

IIT Student Death: నిరాహార దీక్షకు తండ్రి హెచ్చరిక

Sep 23 2026 12:58 PM | Updated on Sep 23 2026 1:04 PM

IIT Bombay Student Death: Father Threatens Hunger Strike Over Arrests

ముంబై: ఐఐటీ-బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మృతి కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ అధికారులను అరెస్ట్ చేయకపోతే నిరాహార దీక్ష చేపడతానని మృతుని తండ్రి రవీంద్ర వాకోడే ప్రకటించారు. ముంబై చేరుకున్న ఆయన మంగళవారం క్రైమ్ బ్రాంచ్ అధికారులను కలిశారు. తన కుమారుడి మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఐఐటీ-బాంబేలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్ గత వారం క్యాంపస్‌లో మృతి చెందాడు. సాహిల్ తల్లిదండ్రులు తమ కుమారుడు కుల ఆధారిత వేధింపులు, వివక్షను ఎదుర్కొన్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

సాహిల్ మృతికి దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు ఐఐటీ-బాంబే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఐఐటీ-పాలక్కాడ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ ప్రొఫెసర్ రమేశ్ వెంకటేశ్వరన్ నేతృత్వంలోని ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇందులో ఐఐటీ-బాంబేకు చెందిన ముగ్గురు అధ్యాపకులు, ముగ్గురు విద్యార్థులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ విజిలెన్స్ అధికారి, ఓ సైకియాట్రిస్ట్ ఉన్నారు. కమిటీ వివరాలను కేంద్ర విద్యాశాఖకు కూడా పంపినట్లు సంస్థ అధికారి తెలిపారు.

ఈ కేసులో పేరున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాపై వేధింపులకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ పూర్తయ్యే వరకు ఆయన సెలవుపై వెళ్లాలని సంస్థ సూచించింది. అయితే కొందరు అధికారులు రాజీనామా చేయాలన్న విద్యార్థుల డిమాండ్లను బోర్డు అంగీకరించలేదని సమాచారం. సాహిల్‌కు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం సాయంత్రం ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు క్యాంపస్‌లో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో ప్రొఫెసర్ దూల్లాకు కూడా పలువురు విద్యార్థులు మద్దతు తెలిపారు.

సాహిల్ మృతికి సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ఐఐటీ-బాంబేలో పరీక్షల భద్రతా ఏర్పాట్లపైనా ప్రశ్నలు తలెత్తాయి. తనిఖీలు ఉన్నప్పటికీ సహిల్ పరీక్షా హాల్లోకి మొబైల్ ఫోన్ ఎలా తీసుకెళ్లగలిగాడన్న దానిపై చర్చ జరుగుతోంది. పరీక్షా హాళ్ల బయట, వాష్‌రూమ్‌ల వద్ద కూడా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామని ఓ అధ్యాపకుడు తెలిపారు. అయితే తనిఖీలు కొన్ని సందర్భాల్లో నామమాత్రంగానే ఉంటాయని, అనుమతించిన వస్తువులతో పాటు ఫోన్‌ను దాచుకుని తీసుకెళ్లే అవకాశం ఉందని ఓ విద్యార్థి పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: Mumbai: షుగర్‌ వ్యాధిగ్రస్తులకు గణపయ్య ప్రసాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement