ముంబై/రాయ్‌పూర్: వినాయక చవితి వేడుకల్లో గణపయ్యలు ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని అలరిస్తున్నారు. ముంబైలోని మాతుంగా మార్కెట్‌లో గణపతికి ఏకంగా 250 కిలోల వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ పూల అలంకరణల కోసం ఈ 12 రోజులకు సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుండగా.. మొత్తం ఉత్సవాల నిర్వహణకు రూ.25 లక్షలకు పైగా వ్యయం అవుతోంది. తమిళనాడులోని సేలం జిల్లా నుంచి ఆలయ అలంకరణల్లో నైపుణ్యం కలిగిన ఆరుగురు డెకరేటర్లను ప్రత్యేకంగా రప్పించారు.
ఇక ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని బజరంగ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన ‘సిక్కే వాలే గణేశ్’ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివ శక్తి యువ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గణపతి విగ్రహాన్ని ఏకంగా 50 వేల భారతీయ నాణేలతో అలంకరించారు. రూ.1 నుంచి రూ.20 వరకు గల నాణేలను విగ్రహంలోని వివిధ భాగాల్లో ప్రత్యేక నమూనాల్లో అమర్చారు. దూరం నుంచి చూస్తే మెరుపులతో కనిపించే ఈ విగ్రహాన్ని దగ్గరగా పరిశీలిస్తే వేలాది నాణేలు కనిపిస్తాయి.
మాతుంగా గణపతి అలంకరణలో ఒక్కో రకమైన పూల ధర కిలోకు సుమారు రూ.250 వరకు ఉందని స్థానికులు తెలిపారు. గణేశోత్సవాల సందర్భంగా నాలుగు దశల్లో పూల అలంకరణలను మార్చనున్నారు. ఈ ప్రత్యేక అలంకరణలు, నాణేలతో చేసిన గణపతి విగ్రహాలను చూసేందుకు భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ముంబైలో పూల గణపతి.. రాయ్‌పూర్‌లో నాణేల గణపతిగా ఈ రెండు విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
ఇదీ చదవండి: షాకిస్తున్న దాల్ సరస్సు.. ఏవీ నాటి అందాలు?


