మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే, గర్బా కార్యక్రమాల్లో ముస్లింల ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్, AIMIM పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గర్బా ఉత్సవాల్లో అన్యమతస్థులు ప్రవేశించకుండా ఉండటానికి, హిందువులనే నిర్ధారించడానికి నిర్వాహకులు ఆధార్ కార్డులను పరిశీలించాలన్న డిమాండ్ రేపిన దుమారానికి మధ్య ఈ వ్యాఖ్యలు మరింత అగ్గిని రాజేశాయి.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హుజూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ... ముస్లిం యువకులు గర్బా వేడుకలకు ఒంటరిగా కాకుండా తమ సోదరీమణులు, కూతుళ్లను కూడా వెంటబెట్టుకుని రావాలని అన్నారు. ఆ తర్వాత తర్వాత వ్యంగ్యంగా నవ్వుతూ దీనికి కుర్రాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారనడం,దానికి ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తం కావడం మరింత ఆందోళన రేపింది.
అంతేకాదు ముస్లింలు పూర్తిగా హిందూ ధర్మంలోకి మారాలనుకుంటే తాము స్వాగతిస్తామని, 'జై శ్రీరామ్' అని నినాదాలు చేస్తూ నుదుటిపై తిలకం ధరించాలని పేర్కొన్నారు. గర్బాను ప్రదర్శనగా మార్చడానికి ప్రయత్నిస్తే లేదా 'లవ్ జిహాద్'కు పాల్పడితే యువత తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలను భోపాల్ సెంట్రల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ తీవ్రంగా ఖండించారు. రమేశ్వర్ శర్మ వ్యాఖ్యలు అత్యంత నీచమైనవని, ఆయన తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ముస్లింలకు గర్బాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రోజుకు రూ. 50 వేలు : ఈమె వ్యాపారం ఏంటో తెలుసా?
అలాగే ఏఐఎంఐఎం (AIMIM) మధ్యప్రదేశ్ అధ్యక్షుడు మొహ్సిన్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఈ రకమైన ప్రకటనలు దేశాన్ని విభజించేలా ఉన్నాయని, బీజేపీ ముస్లిం నాయకులు తమ సొంత కుటుంబసభ్యులను గర్బాకు తీసుకెళ్తారా అని ప్రశ్నించారు.


