హిసార్: హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ గ్రామంలో ప్రేమ వివాహాలపై వివాదాస్పద తీర్మానం వెలువడింది. ఒకే గ్రామానికి చెందిన వారు ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణకు గురిచేయాలని గ్రామ పెద్దల సమావేశం నిర్ణయించింది. ఈ వివాహాలకు మద్దతు ఇచ్చే కుటుంబ సభ్యులు, బంధువులపైనా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. ఆర్యా నగర్ గ్రామంలో ఆదివారం జరిగిన సామాజిక పంచాయతీకి సుమారు 1,000 మంది హాజరయ్యారు. గ్రామ పెద్ద కుల్వంత్ గోస్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేశారు. గ్రామంలో ఇటీవల మూడు ప్రేమ వివాహాలు జరగడమే ఈ నిర్ణయానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ మూడు జంటల్లో రెండు వేర్వేరు కులాలకు చెందినవారు కాగా, మరో జంట ఒకే కులానికి చెందినదని సమాచారం.
ప్రేమ వివాహాలపై గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఓ కమిటీ ఇంటింటికీ వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే గ్రామ సర్పంచ్ రతన్ సింగ్ ఈ నిర్ణయంతో గ్రామ పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను సమావేశానికి హాజరైనప్పటికీ, తీర్మానం అధికారిక గ్రామ పంచాయతీ నిర్ణయం కాదని చెప్పారు. ఈ వ్యవహారంపై హిసార్ ఎస్పీ సిద్ధాంత్ జైన్ స్పందిస్తూ.. ఈ ఉదంతాన్ని పరిశీలిస్తున్నమని, ఇలాంటి వివాహాలు చేసుకున్న జంటల రక్షణకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు.
ఇదీ చదవండి: హనుమాన్ చాలీసా పఠిస్తూ.. వానరానికి అంత్యక్రియలు!


