చెన్నై: ద్రవిడ ఉద్యమ నేత, ద్రవిడ కజగం (డీకే) వ్యవస్థాపకుడు ఈవీ రామసామి నాయక్కర్ (పెరియార్)పై తన వైఖరిని మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై స్పష్టం చేశారు. మహిళా విముక్తి, కుల నిర్మూలన కోసం పెరియార్ చేసిన కృషిని తాను అంగీకరిస్తున్నానని, అయితే ఆయన నాస్తిక భావజాలాన్ని, బ్రాహ్మణ వ్యతిరేక వైఖరిని మాత్రం పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. సెప్టెంబర్ 17న పెరియార్ జయంతి సందర్భంగా అన్నామలై చేసిన నివాళిపై కొందరు మద్దతుదారుల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
సెప్టెంబర్ 20న మదురైలో జరిగిన కార్యక్రమంలో ‘వీ ద లీడర్స్’ కార్యకర్తలను ఉద్దేశించి అన్నామలై మాట్లాడారు. మహిళా సాధికారత, కుల వివక్ష నిర్మూలన అంశాల్లో పెరియార్ చేసిన కృషిని అంగీకరిస్తున్నామని చెప్పారు. అయితే పెరియార్ నాస్తిక భావాలను, బ్రాహ్మణ వ్యతిరేక వైఖరిని మాత్రం పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. పెరియార్ 147వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న అన్నామలై సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు. సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో పెరియార్ కీలక పాత్ర పోషించారని, తమిళనాడు సామాజిక, రాజకీయ చరిత్రపై చెరగని ప్రభావం చూపారని ఆయన పేర్కొన్నారు. అసమానతలు, మూఢనమ్మకాలపై పెరియార్ తన జీవితంలో ఎక్కువ భాగం పోరాడారని కూడా అన్నారు.
అన్నామలై నివాళిపై ఆయన మద్దతుదారుల్లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ మతపరమైన అంశాలతో అనుబంధం ఉన్న నాయకుడిగా కనిపించే అన్నామలై, నాస్తిక, హేతువాద భావజాలంతో గుర్తింపు పొందిన పెరియార్‌ను ఎందుకు ప్రశంసించారని ప్రశ్నించారు. పెరియార్ విగ్రహాలు, ఆలయాల సమీపంలో నాస్తిక సందేశాల అంశంపై అన్నామలై గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా కొందరు గుర్తుచేశారు.
పెరియార్ రాజకీయ చరిత్రలో అనేక వైరుధ్యాలు ఉన్నాయని అన్నామలై పేర్కొన్నారు. హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి 1935, 1965లో పెరియార్ చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా ప్రస్తావించారు. అలాగే కాంగ్రెస్, డీఎంకేతో పెరియార్‌కు ఉన్న రాజకీయ సంబంధాలను కూడా ఆయన ప్రస్తావించారు. 1961లో అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి కె. కామరాజ్‌కు ఓటు వేయాలని పెరియార్ పిలుపునిచ్చారని తెలిపారు.
హిందూ ఆలయాల వెలుపల నాస్తిక సందేశాలతో ఉన్న విగ్రహాల విషయంలోనూ అన్నామలై తన వైఖరిని పునరుద్ఘాటించారు. ‘వీ ద లీడర్స్’ అధికారంలోకి వస్తే అలాంటి విగ్రహాలను ఇతర బహిరంగ ప్రదేశాలకు తరలిస్తామని చెప్పారు. అయితే వాటిని ధ్వంసం చేయబోమని, గౌరవప్రదంగా మరోచోటికి తరలిస్తామని స్పష్టం చేశారు. ఆలయంలోకి వెళ్లే భక్తులకు నేరుగా నాస్తిక సందేశాలు ఎదురుకాకూడదన్నది తన అభిప్రాయమని తెలిపారు.
బీజేపీ నుంచి వైదొలిగిన అనంతరం అన్నామలై ‘వీ ద లీడర్స్’ అనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పెరియార్‌పై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తన రాజకీయ, భావజాల వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. పెరియార్ సామాజిక సంస్కరణలలోని మహిళా హక్కులు, కుల నిర్మూలన అంశాలను అంగీకరిస్తూనే.. ఆయన నాస్తిక, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని మాత్రం అంగీకరించబోనని అన్నామలై తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: నవరాత్రి వేళ.. అద్దెకు ‘గర్బా’ పార్ట్‌నర్ వివాదం!


