గాంధీనగర్: గుజరాత్‌లో నవరాత్రి వేడుకలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘రెంట్ ఏ గర్బా పార్ట్‌నర్’ ప్రకటనలు వివాదానికి దారితీశాయి. రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ప్యాకేజీలను పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిస్తున్న ఈ పోస్టులపై అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. గుర్తుతెలియని ఖాతాలకు డబ్బులు పంపవద్దని సూచించారు. స్థానికులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేసి విచారణకు డిమాండ్ చేశారు.
రూ.1,000 నుంచి ప్యాకేజీలు?
వైరల్ అవుతున్న పోస్టుల్లో ‘సిల్వర్’, ‘గోల్డ్’, ‘ప్లాటినమ్’ పేర్లతో ప్యాకేజీలను పేర్కొన్నారు. సిల్వర్ ప్యాకేజీకి రెండు గంటల గార్బా సహచర్యానికి రూ.1,000, గోల్డ్ ప్యాకేజీకి నాలుగు గంటలకు రూ.1,500, ప్లాటినమ్ ప్యాకేజీకి రాత్రంతా రూ.2,000గా చూపించారు. సరిపోలే దుస్తులు, డ్యాన్స్ నేర్పడం, సెల్ఫీలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫొటోలు వంటి ఆఫర్లు ఉన్నట్లు పోస్టుల్లో పేర్కొన్నారు. కొన్ని పోస్టుల్లో అదనపు సేవలు, అధిక ధరలను కూడా చూపించారు.
డబ్బులు పంపొద్దన్న సైబర్ పోలీసులు
అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్ ఈ పోస్టులను గత ఐదు, ఆరు రోజులుగా పరిశీలిస్తున్నట్లు ఏసీపీ హార్దిక్ మండాకియా తెలిపారు. గుర్తుతెలియని ప్రకటనలను నమ్మి డబ్బులు పంపవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే డబ్బులు పంపినవారు సైబర్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. సేవలు అందిస్తామని చెబుతున్న వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించుకున్న తర్వాతే వ్యక్తిగత వివరాలు లేదా చెల్లింపులు చేయాలని సూచించారు.
ગરબા માટે ભાડે પાર્ટનરની પોસ્ટ વાયરલ#Garba #GarbaPartner #RentAPartner #Navratri #GarbaNight #ViralPost #SocialMediaTrend #GujaratNews pic.twitter.com/k3OcNjGwvx
— Sandesh (@sandeshnews) September 20, 2026
అసలు సేవలు ఉన్నాయా?
ఈ ట్రెండ్ సెప్టెంబర్ మధ్యలో కృష్ణ్ మిస్త్రీ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు చేసిన వ్యంగ్య పోస్టుతో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ‘ఈ నవరాత్రి వేళ ఒంటరిగా డ్యాన్స్ చేయొద్దు’ అనే నినాదంతో మూడు ప్యాకేజీలను చూపించిన ఆ పోస్టును వినోదం, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ కోసమే చేశామని ఖాతాదారు తెలిపారు. విపరీతంగా వైరల్ కావడంతో ఆ పోస్టును తొలగించారు. అనంతరం అహ్మదాబాద్, సూరత్, ముంబై తదితర ప్రాంతాలకు చెందిన ఇతర ఖాతాల్లోనూ ఇలాంటి పోస్టులు కనిపించాయి.
మీమ్స్‌గానే పోస్టులు?
మీడియా పరిశీలనలో కొన్ని పోస్టులు చేసిన పేజీల నిర్వాహకులు వాటిని మీమ్స్ లేదా జోక్స్‌గా అభివర్ణించినట్లు సమాచారం. వాస్తవంగా అద్దెకు గర్బా పార్ట్‌నర్లు అందుబాటులో లేరని కూడా కొన్ని పేజీల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ సైబర్ అధికారులు సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై నిఘా కొనసాగిస్తున్నారు.
విచారణకు స్థానికుల డిమాండ్
ఈ పోస్టులపై స్థానికుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సూరత్ బజరంగ్ దళ్ కార్యకర్త ప్రతాప్ రాజ్‌పురోహిత్.. నవరాత్రి అంటే దేవీ ఆరాధన, భక్తి, సంప్రదాయ గార్బా వేడుకలకు సంబంధించిన పండుగ అని పేర్కొంటూ, ఈ తరహా పోస్టులపై అభ్యంతరం తెలిపారు. గుజరాత్ బజరంగ్ దళ్ ప్రాంతీయ సహ కన్వీనర్ జ్వలిత్ మెహతా కూడా పోస్టుల వెనుక ఉన్నవారిని గుర్తించి వారి ఉద్దేశాలపై విచారణ జరపాలని కోరారు.
నవరాత్రి వేళ అప్రమత్తం
గుజరాత్‌లో నవరాత్రి సందర్భంగా సొసైటీలు, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున గర్బా కార్యక్రమాలు జరుగుతాయి. వేడుకలు సమీపిస్తున్న కొద్దీ ఈవెంట్లు, దుస్తులు, సమావేశాలకు సంబంధించిన సోషల్ మీడియా ప్రచారం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ‘రెంట్ ఏ గర్బా పార్ట్‌నర్’ పోస్టులపై పోలీసులు నిఘా పెట్టారు. అయితే ఈ నిర్దిష్ట పోస్టుల కారణంగా డబ్బు కోల్పోయినట్లు ఇప్పటివరకు అధికారికంగా కేసులు నమోదైనట్లు సమాచారం లేదు.
ఇదీ చదవండి: భూ వివాదం: సీఎం ఇంటిముందు టవర్ ఎక్కిన మహిళ


