కాంగ్రెస్‌ బిగ్‌ ప్లాన్‌.. సిరిసిల్ల, సిద్దిపేటలో భారీ సభలు | Congress Plan Key Meetings At Sircilla And Siddipet | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ బిగ్‌ ప్లాన్‌.. సిరిసిల్ల, సిద్దిపేటలో భారీ సభలు

Sep 21 2026 1:09 PM | Updated on Sep 21 2026 1:09 PM

Congress Plan Key Meetings At Sircilla And Siddipet

సాక్షి, హైదరాబాద్‌: గులాబీ నేతల కంచుకోటల్లో కాంగ్రెస్‌ రాజకీయ సమరానికి సిద్ధమవుతోంది. బీఆర్‌ఎస్‌ కీలక నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని సిద్దిపేట, సిరిసిల్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. ఈ నెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్‌ బహిరంగ సభ నిర్వహించనుండగా.. అక్టోబర్‌ మొదటి వారంలో సిద్దిపేటలో సభకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ మేరకు సభల ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత డీసీసీ అధ్యక్షులను పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆదేశించినట్లు సమాచారం. రెండు నియోజకవర్గాల్లో సభల ద్వారా పార్టీ శ్రేణులను సమీకరించడంతో పాటు, బీఆర్‌ఎస్‌ నేతలపై రాజకీయంగా ఎదురుదాడి చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సిరిసిల్ల, సిద్దిపేటలో జరగనున్న సభలపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సభల్లో ఎవరెవరు పాల్గొంటారు? హరీశ్‌రావు, కేటీఆర్‌లపై కాంగ్రెస్‌ నేతలు ఎలాంటి విమర్శలు చేస్తారు? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే, సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్‌ బహిరంగ సభల నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే సంకేతాలిచ్చారు. సెప్టెంబర్‌ 5న నకిరేకల్‌ సభలో మాట్లాడుతూ.. ఈ నెలాఖరులో సిరిసిల్లకు, అక్టోబర్‌లో సిద్దిపేటకు వస్తానని ప్రకటించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని సవాల్‌ చేశారు. ఇటీవల సిద్దిపేటలో కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు భూముల వ్యవహారాలపై పర్యటించగా.. హరీశ్‌రావు తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించానని స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరిసిల్ల, సిద్దిపేట సభలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తెలంగాణభవన్‌లో కీలక సమావేశం.. 
మరోవైపు.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ.. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో వారు భేటీ అయ్యారు. 22ఏ భూముల వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలను కాంగ్రెస్‌ టార్గెట్‌ చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌ నేతల ఫామ్‌హౌస్‌ పర్యటనలు, 22ఏ భూముల వివాదం, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. పార్టీ నేతలపై అధికార పార్టీ చేస్తున్న విమర్శలు, వాటికి ఎలా స్పందించాలనే అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.

దానం నాగేందర్‌ అంశంపైనా చర్చ?
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్‌.. కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయనపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. ఈ పరిణామంపై బీఆర్‌ఎస్‌ నేతలు తదుపరి అనుసరించాల్సిన రాజకీయ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement