Uttarakhand: నకిలీ పత్రాలతో ఎంబీబీఎస్ అడ్మిషన్లు? | Uttarakhand MBBS Admission Scam Probe Ordered into 350 Suspected Fake Certificates | Sakshi
Sakshi News home page

Uttarakhand: నకిలీ పత్రాలతో ఎంబీబీఎస్ అడ్మిషన్లు?

Sep 20 2026 12:53 PM | Updated on Sep 20 2026 12:53 PM

Uttarakhand MBBS Admission Scam Probe Ordered into 350 Suspected Fake Certificates

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఎంబీబీఎస్ రాష్ట్ర కోటా అడ్మిషన్లలో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు 350 మంది అభ్యర్థుల స్థానికత, కేటగిరీ సర్టిఫికెట్లు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ విజిల్‌బ్లోయర్ ప్రదీప్ బహుగుణ సమర్పించిన జాబితా ఆధారంగా వైద్య విద్యాశాఖ మంత్రి సుబోధ్ ఉనియాల్ జిల్లా స్థాయి విచారణకు ఆదేశించారు.

ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని డెహ్రాడూన్ జిల్లా మేజిస్ట్రేట్‌ను మంత్రి ఆదేశించారు. ఇటీవల స్వాతంత్య్ర సమరయోధుల ఆధారిత (ఎఫ్‌ఎప్‌డీ) నకిలీ ధ్రువపత్రాలను సమర్పించినందుకు గాను నలుగురు అభ్యర్థుల ఎంబీబీఎస్ ప్రవేశాలను అధికారులు రద్దు చేసిన నేపథ్యంలో ఈ తాజా విచారణ తెరపైకి వచ్చింది. అనుమానిత జాబితాలోని పలువురు అభ్యర్థులు బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో పాఠశాల విద్యను అభ్యసించడమో లేదా ఉత్తరాఖండ్ వెలుపల నుంచి ‘నీట్’ పరీక్ష రాయడమో చేసినప్పటికీ, ఇక్కడ రాష్ట్ర కోటా సీట్లను పొందడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే పలు సర్టిఫికెట్ల నంబర్లు రికార్డుల్లో కనిపించకపోవడం, పోర్టల్స్‌లోని వివరాల్లో తేడాలు, ఒకే చిరునామాతో అనేక పత్రాలు అనుసంధానమై ఉండటం వంటి లోపాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఈ ధ్రువపత్రాల పునఃపరిశీలనను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి తోడు నకిలీ రిజర్వేషన్ పత్రాల అంశంపై డెహ్రాడూన్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా విచారణ జరుపుతోంది. దర్యాప్తులో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు రుజువైతే సదరు అభ్యర్థుల సీట్లను తక్షణమే రద్దు చేయడంతో పాటు, వారిని భవిష్యత్ ప్రవేశాలకు బ్లాక్‌లిస్ట్ చేయడం, వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండి: మోస్ట్‌ వాంటెడ్‌.. బ్రిజేష్‌ గంజూ కథ ముగిసింది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement