కూలీల కుటుంబం నుంచి ఐదుగురికి ఎంబీబీఎస్‌ సీట్లు! | Kandhamal Family Sees Five Children Secure Medical Seats | Sakshi
Sakshi News home page

పేద కుటుంబం నుంచి ఐదు మెడికల్‌ సీట్లు..!తల్లిదండ్రులు దినసరి కూలీలు..

Sep 16 2026 2:10 PM | Updated on Sep 16 2026 4:33 PM

Kandhamal Family Sees Five Children Secure Medical Seats

ధనవంతుల కుటుంబంలో పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారంటే..వాళ్లకు అన్ని వెసులబాటులు, సౌకర్యాలు ఉంటాయి. అదేమంత కష్టం కాదు వారి పరపతికి. అదే కడు పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు ఉన్నత చదువు అందుకున్నారంటే అది మాములు విషయం కాదు. కానీ అదే పేద కుటుంబంలోని తోబుట్టువులంతా ప్రభుత్వ కాలేజ్‌లో మెడికల్‌ సీట్లు సాధించారంటే..అది అలాంటి ఇలాంటి సక్సెస్‌ కాదు.

కటిక పేదరికం నుంచి ఆ స్థాయికి చేరుకోవడం అంటే దాని వెనుక ఎంత కష్టం, ఎన్ని కన్నీటి పరిస్థితులను జయించి అక్కడిదాక చేరుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సక్సెస్‌నే అందుకుంది ఒడిస్సాలో కాంధమాల్‌కి చెందిన ఓ పేద కుటుంబం. మరి ఆ కుటుంబంలోని ఐదుగురు ఇంత పెద్ద విజయాన్ని ఎలా అందుకున్నారో తెలుసుకుందామా..!.

ఆ పేద దంపుతులే బుర్సి(73),  అనసూయ ప్రధాన్ (62)లు. ఇరువురు దినసరి కూలీలు. వారి నలుగురు పిల్లలు, తమ్ముడి కూతురు ఒడిశాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. ఈ దంపుతుల పెద్ద కుమారుడు బిభిసాన్‌ ప్రధాన్‌ 2021లో కోరాపుట్‌లోని శ్రీ లక్ష్మణ నాయక్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో చదువుతున్నాడు. గతేడాది వారి కుమార్తె మోనాలిసా అదే కళాశాలలో ప్రవేశం పొందింది.

ఈ ఏడాది కుమారుడు భవానిపట్నంలోని షహీద్ రిండో మాఝీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేరగా, కుమార్తె సునేమి బలాంగిర్‌లోని భీమ భోయ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సీటు పొందింది. అలాగే అదే ఇంట్లో నివశిస్తున్న బర్సి తమ్ముడి కూతురు మీనాక్షి ప్రధాన్ కూడా ఈ ఏడాది NEET పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, పూరీలోని శ్రీ జగన్నాథ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సీటు పొందింది.  ఏడుగురు పిల్లలున్న బుర్సి తన కుటుంబాన్ని పోషించడానికి, పిల్లల చదువుల కోసం కేరళలో ఏళ్ల తరబడి కూలీగా పనిచేశారు.

అనారోగ్య కారణాల రీత్యా ఇంటికి తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం కుటుంబం పరిమిత ఆర్థిక వనరులతో గడుపుతోంది. వాళ్లంతా ఏమంతా సులభంగా వైద్య కళాశాలలో సీటు పొందలేదు. కుమార్తె మోనాలిసా నీట్‌కి సన్నద్ధమవుతూనే బెర్హంపూర్‌లోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేసేది. అలాగే తన అన్నయ్య చదువుకి సహాయపడింది. ఇక ఆమె బెర్హంపూర్‌లోని MKCG మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన ఒక వైద్యుని ఆర్థిక సహాయంతో, గతేడాది మెడికల్‌ సీటు సాధించి, తన కృషికి తగిని ఫలితాన్ని అందుకుంది. తన అక్కా అన్నయ్యల స్ఫూర్తితోనే అసరియా, సునేమి, ఇంటర్‌ పూర్తి అయిన వెంటనే నీట్‌కి సన్నద్ధమయ్యారు.

వారు బెర్హంపూర్‌లో ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని కలిసి చదువుకున్నారు. విశేషమేమిటంటే, ఎటువంటి కోచింగ్ లేకుండానే వారిద్దరూ అత్యంత పోటీతో కూడిన నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇదంతా తన అన్నయ్య, అక్కల క్రెడిట్‌ అని, వాళ్లే మాకు మార్గనిర్దేశం చేశారని చెబుతున్నారు. ఈ ఇద్దరూ కూడా తొలి ప్రయత్నంలోనే నీట్‌ సాధించారు. పేదరికం నుంచి వచ్చి పిల్లలంతా ఎంబీబీఎస్‌ సీటు ప్రభుత్వ కాలేజ్‌లోనే పొందడం మాములు విషయం కాదు, మొత్తం ఆ కుటుంబానికే గర్వకారణం ఇది. అయితే ఆ కుటుంబానికి ఇది సంతోషంగా ఉన్నా..రాబోయే ఏళ్లలో వాళ్ల చదువుకి ఎలా తోడ్సాడలన్నేది ఆ పేద తల్లిదండ్రుల ముందు కదలాడుతున్న ప్రశ్న.

కాలేజ్‌ ప్రవేశ రుసుము అయినా సంపాదించగలనో లేదో అని తల్లి అనుసయ దిగులు వ్యక్తం చేసింది. అయితే ఇంటర్న్‌షిప్‌పూర్తి చేస్తున్న పెద్ద కుమారుడు తన తమ్ముడు, చెల్లెలు చదువుకి సహాయపడతానని తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడం విశేషం. ఆ కుటుంబంలో లక్ష్మీదేవి కటాక్షం లేదేమో కానీ సరస్వతీ దేవి కటాక్షం మెండుగా ఉంది కదూ. తల్లిదండ్రుల రెక్కల ముక్కల కష్టాన్ని అర్థం చేసుకుని ఈ స్థాయిలో చదువుతున్న ఆ పిల్లలు నిజంగా యువతకు స్ఫూర్తి.
 

ఇదీ చదవండి: కాళ్లే చేతులుగా.. పాఠాలు బోధించే మాష్టారు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement