బీజేపీకి కొత్త చిక్కులు.. యూపీ‘ఐ’ ఫైట్‌ తప్పదా? | BJP Faces New Challenge Will UPI Fight Erupt in Uttar Pradesh Election | Sakshi
Sakshi News home page

బీజేపీకి కొత్త చిక్కులు.. యూపీ‘ఐ’ ఫైట్‌ తప్పదా?

Sep 16 2026 12:22 PM | Updated on Sep 16 2026 12:49 PM

BJP Faces New Challenge Will UPI Fight Erupt in Uttar Pradesh Election

జేబుల్లో, పర్సుల్లో క్యాష్‌ పెట్టడం జనాలకు అరుదుగా మారిపోయింది. చిల్లర నుంచి పెద్ద పెద్ద పేమెంట్ల దాకా ఫోన్‌తోనే జరిగిపోతోంది. అలాంటిది యూపీఐ (UPI)తో చెల్లింపుల విషయంలో కొత్త రూల్స్‌ జనాలను బెంబేలెత్తిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, ఆపై డిజిటల్‌ చెల్లింపులంటూ క్యాష్‌లెస్‌ విధానం అలవాటు చేసిన ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పుడు ఛార్జీల ద్వారా పరోక్షంగా సామాన్యుడిపై భారం వేసే ప్రయత్నమూ చేస్తోంది. అయితే రానున్న రోజుల్లో ఇదే బీజేపీ పాలిట గుదిబండగా మారుతుందా?..

2016 నవంబర్‌ 8.. రూ.500, రూ.1,000 నోట్ల చెల్లుబాటును రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పునకు దారితీసింది. నగదు లావాదేవీలపై ఆధారపడిన ప్రజలకు ఒక్కసారిగా ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాల అవసరం ఏర్పడింది. అదే సమయంలో ప్రభుత్వం డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం ప్రారంభించింది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయని.. ఇకపై నగదు ఆధారిత వ్యవస్థను తగ్గించి ‘క్యాష్ లెస్‌‌ ఎకానమీ’ వైపు వెళ్లాలని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడితోనే ఆగకుండా.. డిజిటల్‌ పేమెంట్లు చేసే వినియోగదారులు, వ్యాపారులను ప్రోత్సహించేందుకు ‘లక్కీ గ్రాహక్‌ యోజన’, ‘డిజి-ధన్‌ వ్యాపార్‌ యోజన’ వంటి ప్రోత్సాహక పథకాలను తీసుకొచ్చింది. అలా క్రమంగా డిజిటల్‌ చెల్లింపులు వ్యవస్థ.. అర్బన్‌ నుంచి రూరల్‌ ప్రాంతాలకు విస్తరించగలిగింది.

ఇప్పుడు అదే UPIపై ఛార్జీల చర్చ!
ఇప్పుడు UPI లావాదేవీలపై MDR చర్చకు దారితీస్తోంది. తాజా నిబంధనల ప్రకారం.. ఒకరి నుంచి ఒకరు యూపీఐ(ఫోన్‌పే, గూగుల్‌పే ఇలా.. ) చేసుకునే చెల్లింపులు పూర్తిగా ఉచితం. కానీ, రూ.2,000 దాటి ఏదైనా బయట షాపింగ్‌, కొనుగోలు చేస్తే మాత్రం MDR పడుతుంది. అలాగే.. చిన్న వ్యాపారులకు కూడా జీరో-MDR రక్షణ కొనసాగుతుందని కేంద్రం చెబుతోంది. దాదాపు 96 శాతం మర్చంట్‌ UPI లావాదేవీలు ప్రభావితం కావని ప్రభుత్వం వెల్లడించింది. కానీ, ఆర్థిక నిపుణులు మాత్రం మరోలా చెబుతున్నారు. ఇది సామాన్యుడిపై భారం పడే స్థితికి కచ్చితంగా తెస్తుందని అంచనా వేస్తున్నారు.  దీంతో ‘UPIపై ఛార్జీలు’ అనే అంశం రాజకీయ చర్చలోకి వచ్చింది.

రాహుల్‌ గాంధీ ఎంట్రీ.. రాజకీయ వేడి..  
ఇదే అంశాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయంగా ప్రశ్నిస్తున్నారు. 2,000కు మించిన లావాదేవీలు మొత్తం UPI లావాదేవీల్లో సంఖ్య పరంగా సుమారు 5 శాతమే అయినప్పటికీ.. వాటి విలువ మొత్తం UPI లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మర్చంట్‌పై MDR విధించినా.. వ్యాపారులు ఆ ఖర్చును చివరకు వస్తువులు, సేవల ధరల్లో కలిపి వినియోగదారుడిపై మోపే అవకాశం ఉందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు.. భారత్‌లోని జీరో-MDR విధానాన్ని అమెరికా చెల్లింపుల సంస్థలు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయని, తాజా మార్పు అమెరికా ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమంటూ రాహుల్‌ ఆరోపించారు. ఈ అంశాన్ని అమెరికా ట్రేడ్‌ డీల్‌ చర్చలతోనూ ముడిపెట్టారు. అయితే, కేంద్రం వాదన మరోలా ఉంది. UPI వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో సైబర్‌ సెక్యూరిటీ, మోసాల నిరోధం, టెక్నాలజీ, మౌలిక వసతులపై నిరంతరం పెట్టుబడులు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ఆ వ్యవస్థ దీర్ఘకాలికంగా కొనసాగేందుకు పరిమిత MDR అవసరమని వివరిస్తోంది.

యూపీ ఎన్నికల్లో ఎందుకు కీలకం?
యూపీఐ అంటే కేవలం యాప్‌లో డబ్బు పంపడం కాదు. కూరగాయల బండి, టీ దుకాణం, మెడికల్‌ షాప్‌, చిన్న హోటల్‌, ఆటో.. ఇలా రోజువారీ లావాదేవీల్లోకి అది వెళ్లిపోయింది. అందుకే ఛార్జీల అంశం కేవలం బ్యాంకింగో లేదంటే ఫిన్‌టెక్‌ పాలసీగా కాకుండా చిన్న వ్యాపారి, వినియోగదారుడి జేబుకు సంబంధించిన అంశంగా రాజకీయ పార్టీలు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇదే పాయింట్‌ను కాంగ్రెస్‌ పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ‘ఒకప్పుడు డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించారు.. ఇప్పుడు పెద్ద మొత్తంలోని మర్చంట్‌ లావాదేవీలకు MDR ఎందుకు?’ అనే ప్రశ్నను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించాలనుకుంటోంది. వచ్చే ఏడాదిలో ఏడు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని పలు సమస్యలతో పాటు యూపీఐని కూడా ఎన్నికల ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

క్యూఆర్‌ కోడ్‌ టూ రాజకీయ కోడ్‌.. 
ఇప్పటికే రైతులు, యువత, ఉద్యోగాలు, ధరలు, సంక్షేమ పథకాలు వంటి అంశాల చుట్టూ సాగుతున్న యూపీ రాజకీయంలో.. UP‘I’ ఛార్జీల అంశం కొత్త చర్చకు దారి తీస్తుందా? రోజూ ఫోన్‌లో కనిపించే QR కోడ్‌.. ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ కోడ్‌గా మారుతుందా? లేక ఇది కేవలం కేంద్ర విధానంపై కాంగ్రెస్‌ చేస్తున్న మరో విమర్శగానే మిగిలిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: మోదీని కలిసిన వారం రోజుల్లోనే.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement