దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదం.. ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య. పైగా ఆ వెనక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణ. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బాల్య స్నేహితుడ్ని కలిసి.. సీబీఐ విచారణ జరిపించాలని ఆ పెద్దాయన కోరారు. అవతలి ఉంది మాములు వ్యక్తి కాదు.. అందుకే వారం తిరగ్గ ముందే ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీతో పాఠశాలలో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా.. మహారాష్ట్రలోని భయందర్‌లో తన భూమి వివాదంపై సెప్టెంబర్ 8న మోదీని కలిశారు. ఇది జరిగిన.. వారం రోజుల్లోనే వివాదాస్పద స్థలంపై బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వెనక్కి తగ్గారు. భూమిపై తనకున్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు, అక్కడ నిర్మాణానికి తీసుకున్న అనుమతులను కూడా సరెండర్ చేశారు. వోరాపై గతంలో ఇచ్చిన పోలీస్ ఫిర్యాదును సైతం ఉపసంహరించుకున్నారు.
నాకేం తెలియదు: వోరా
మోదీతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న వోరా.. ప్రస్తుతం ముంబై సమీపంలోని మీరా రోడ్‌లో నివసిస్తున్నారు. భయందర్ ఈస్ట్‌లోని నవ్‌ఘర్‌లో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేశారు. తాను ఆ భూమిని ఎప్పుడూ విక్రయించలేదని, మరెవరికీ బదలాయించలేదని పేర్కొన్నారు.
అయితే 2011లో తనకు తెలియకుండా భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి, ఆస్తిని రెండు భాగాలుగా విభజించినట్లు వోరా ఆరోపించారు. ఒక భాగాన్ని స్వయం బిల్డర్స్ పేరుతో, మరో భాగాన్ని నరేంద్ర మెహతాకు సంబంధించిన సెవెన్ ఎలెవన్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో చూపించినట్లు ఆయన పేర్కొన్నారు. తన భూమిపై నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారనే అంశంపైనా అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కూడా ఆయన కోరారు.
15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా..
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు దాదాపు 15 ఏళ్లుగా వివిధ ప్రభుత్వ విభాగాలను ఆశ్రయిస్తున్నానని వోరా తెలిపారు. 2015లో నకిలీ పత్రాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదైందని, అయితే దర్యాప్తు నివేదిక చాలా ఆలస్యంగా వచ్చిందని ఆయన ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు విభాగాల అధికారులకు ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని వోరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 8న ప్రధాని మోదీని కలిసి తన సమస్యను వివరించారు. ఈ భేటీ అనంతరం మహారాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.
మోదీ ఎఫెక్ట్.. సచివాలయంలో కీలక సమావేశం
సెప్టెంబర్ 15న మహారాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీకర్ పరదేశి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో అస్గర్ అలీ వోరాతో పాటు ఎమ్మెల్యే నరేంద్ర మెహతా, మీరా-భయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా బినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తమ్ షిండే పాల్గొన్నారు.
ఈ సమావేశంలో నరేంద్ర మెహతా టౌన్ ప్లానింగ్ విభాగానికి లేఖ ఇచ్చారు. వివాదాస్పద భూమిపై తాను కలిగి ఉన్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు, ఆ స్థలానికి మంజూరైన నిర్మాణ అనుమతిని కూడా సరెండర్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ఈ భూమిని తాను 2019లో మెర్విన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు మెహతా తన లేఖలో తెలిపారు.
ఫిర్యాదు కూడా ఉపసంహరణ
ఇదే సమయంలో వోరాపై గతంలో తాను చేసిన పోలీస్ ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు మెహతా పోలీస్ కమిషనర్‌కు మరో లేఖ రాశారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరినందున ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భూవివాదానికి ఓ ఎండ్ కార్డ్ పడినట్లైంది.
ఇదీ చదవండి: ఆ హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊరట


