కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) నిబంధనలు దేశవ్యాప్తంగా ఇంధన రిటైల్ రంగంలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, రూ.2,000 దాటిన యూపీఐ వర్తక లావాదేవీలపై ఎండీఆర్ వర్తిస్తుంది. పెట్రోల్ పంపులు, రైల్వేలు, ఇన్సూరెన్స్ వంటి నిత్యవసర రంగాల్లోని రూ.2,000 పైబడిన చెల్లింపులపై ఫ్లాట్‌గా రూ.5 ఎండీఆర్ విధించనున్నారు. వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకూడదని, ఈ భారాన్ని కేవలం వర్తకులే భరించాలని ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి.
పడిపోతున్న లాభాలు.. పెరుగుతున్న భారం
ప్రభుత్వ నిర్ణయంపై పెట్రోల్ బంక్ డీలర్ల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన విక్రయ వ్యాపారం స్వల్ప లాభ శాతంతో నడుస్తుందని, 2017 తర్వాత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మార్జిన్ల పెంపు లేకపోవడంతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నామని బంకు నిర్వాహకులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా బంకుల్లో నమోదయ్యే మొత్తం యూపీఐ లావాదేవీల్లో దాదాపు 20 శాతం వరకు రూ.2,000 కంటే ఎక్కువ విలువైనవే. కొత్త ఎండీఆర్ నిబంధనల వల్ల రోజూ దేశంలోని పెట్రోల్ పంపు నిర్వాహకులపై రూ.2.4 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడుతుందని డీలర్లు అంచనా వేస్తున్నారు.
‘క్యాష్ ఓన్లీ’ నిరసన హెచ్చరిక
ఈ అదనపు చార్జీని భరించడం సాధ్యం కాదని, తమకు ఈ రుసుము నుంచి మినహాయింపు ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ వినతిని పరిగణనలోకి తీసుకోకపోతే రూ.2,000 దాటిన లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులను నిలిపివేసి కేవలం నగదు ద్వారా మాత్రమే ఇంధన విక్రయాలు జరుపుతామని స్పష్టం చేస్తున్నారు. 2016 డీమోనిటైజేషన్ సమయంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎండీఆర్ సబ్సిడీలను అందించిన విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు కూడా అలాంటి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.
వినియోగదారులపై ప్రభావం ఎంత?
సాధారణ ప్రజలకు పీ2పీ లావాదేవీలు ఉచితమే అయినప్పటికీ బంకు నిర్వాహకులు నగదు విధానానికి మారితే సామాన్య వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు చమురు సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని డీలర్లకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?



