దేశంలోనే తొలి స్టెయిన్‌లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు | Rail Freight India First Stainless Steel Salt Container Train | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలి స్టెయిన్‌లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు

Sep 16 2026 7:02 PM | Updated on Sep 16 2026 7:39 PM

Rail Freight India First Stainless Steel Salt Container Train

భారత రైల్వే సరుకు రవాణా విభాగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేచింది. గుజరాత్‌లోని కచ్ జిల్లా శివలాఖా నుంచి మిఠాపూర్ మధ్య నడిచే దేశంలోనే మొదటి ‘స్టెయిన్‌లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు’ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్‌గా ప్రారంభించారు. సాధారణ వ్యాగన్లలో ఉప్పును రవాణా చేసే సమయంలో తేమను పీల్చుకోవడం, వ్యాగన్లు త్వరగా తుప్పు పట్టడం, సరుకు కంటే వ్యాగన్ బరువే ఎక్కువగా ఉండటం వంటి ప్రధాన సమస్యలను ఈ కొత్త సాంకేతికత పరిష్కరిస్తుంది.

తుప్పు పట్టని డిజైన్

ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్, గాలిలోని తేమ కలిసి సాధారణ ఇనుము లేదా ఉక్కు వ్యాగన్లను వేగంగా తుప్పు పట్టేలా చేస్తాయి. అందుకే ఈ కొత్త కంటెయినర్లను అధిక నాణ్యత గల స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. సాధారణ వ్యాగన్లు కొన్ని సంవత్సరాల్లోనే పాడైపోగా స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం వల్ల వ్యాగన్ల జీవితకాలం భారీగా పెరుగుతుంది. నిర్వహణ వ్యయం తగ్గిపోతుంది.

బరువు సమతుల్యత

ఉప్పు బరువుగా ఉండటం వల్ల పాత మోడల్ వ్యాగన్లలో వ్యాగన్ సొంత బరువు (టేర్‌ వెయిట్‌) కంటే మోసే సరుకు నిష్పత్తి సమర్థవంతంగా ఉండేది కాదు. తేలికైన, బలమైన స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉపయోగించడం ద్వారా కంటెయినర్ బరువు తగ్గి, ఎక్కువ పరిమాణంలో ఉప్పును లోడ్ చేసే వెసులుబాటు లభించింది.

వినూత్న లోడింగ్ - అన్‌లోడ్ విధానం

కంటెయినర్ పైభాగం నుంచి నేరుగా ఉప్పును నింపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్‌లోడింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కంటెయినర్‌ను పక్కకు వంచే (టిల్ట్‌) సదుపాయం ఉంది. దీనివల్ల మానవ శ్రమ లేకుండా వేగంగా సరుకును ఖాళీ చేయవచ్చు.

తేమ నిరోధకత

రవాణా సమయంలో ఉప్పు వాతావరణంలోని తేమను పీల్చుకుని గడ్డకట్టడం లేదా తడిసిపోవడం జరుగుతుంది. ఈ సీల్డ్ కంటెయినర్ల వల్ల వర్షం లేదా గాలిలోని తేమ లోపలికి చేరకుండా ఉప్పు దాని సహజ స్థితిలోనే ఉంటుంది.

మౌలిక వసతుల విస్తరణ

ఈ సందర్భంగా గుజరాత్‌లోని భీమాసర్, దేవిలియా, చండీసార్, శివలాఖాలలో పూర్తయిన నాలుగు కార్గో టెర్మినల్స్‌ను కేంద్రమంత్రి జాతికి అంకితం చేయడంతో పాటు, మెహసానాలోని లించ్ వద్ద నూతన గతిశక్తి కార్గో టెర్మినల్‌కు శంకుస్థాపన చేశారు. 2021లో తీసుకొచ్చిన గతిశక్తి విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 కార్గో టెర్మినళ్లు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, కొత్తగా ప్రారంభించిన గోపాల్‌పూర్ రైల్వే స్టేషన్ సేవలతో అహ్మదాబాద్-భుజ్ మార్గంలో నడిచే రైళ్లకు గాంధీధామ్ వద్ద ఇంజిన్ రివర్సల్ చేయాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా కానుందని చెప్పారు.

ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement