దేశంలో నిత్యం కోట్లాది మంది ప్రయాణించే రైళ్లలో ఎక్కువ మందికి ఏదైనా అసౌకర్యం ఉందంటే అది అపరిశుభ్రతే. ఈ దురవస్థను కాస్తయినా తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైళ్లలో చెత్త వేయడం, ఉమ్మడం వంటి పనులు చేసేవారిని కట్టడి చేసేందుకు పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించే వారికి విధించే జరిమానాను ఏకంగా రెట్టింపు చేసింది. ఇప్పటివరకు గరిష్ఠంగా రూ.500గా ఉన్న జరిమానాను రూ.1,000కు పెంచుతూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
కొత్త నిబంధనల ప్రకారం రైల్వే ప్రాంగణాలు, ప్లాట్‌ఫారాలు లేదా రైలు బోగీల్లో నిర్దేశిత ప్రదేశాలు మినహా ఎక్కడపడితే అక్కడ చెత్తను విసరడం, పడేయడం లేదా వదిలిపెట్టడం నిషేధం. ఇలాంటి ఉల్లంఘనలకు రూ.1,000 జరిమానా విధించవచ్చు. కేవలం చెత్త వేయడమే కాదు.. రైల్వే ప్రాంగణాల్లో పరిశుభ్రతకు భంగం కలిగించే మరికొన్ని చర్యలపైనా నిబంధనలు వర్తిస్తాయి.
చెత్త వేయడమే కాదు.. వీటిపైనా నిఘా
నిబంధనల ప్రకారం.. రైల్వే ప్రాంగణాల్లో అనుమతించిన సదుపాయాలు మినహా వంట చేయడం, స్నానం చేయడం, ఉమ్మివేయడం, మూత్ర విసర్జన, మలవిసర్జన, జంతువులు లేదా పక్షులకు ఆహారం వేయడం వంటి చర్యలు కూడా నిషేధం. అలాగే వాహనాలు, పాత్రలు, లేదా ఇతర వస్తువులను కడగడం, బట్టలు ఉతకడం, రైల్వే ప్రాంగణంలో వస్తువులను నిల్వ చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమే.
అదేవిధంగా, రైల్వే అధికారుల అనుమతి లేకుండా పోస్టర్లు అంటించడం, రైలు బోగీలు లేదా రైల్వే ఆస్తులపై రాయడం, గీయడం, వాటిని ధ్వంసం చేయడం కూడా చర్యలకు దారితీయవచ్చు. 2012లో రూపొందించిన ఈ నిబంధనల్లో గతంలో గరిష్ఠ జరిమానా రూ.500గా ఉండేది. తాజా సవరణతో ఆ మొత్తాన్ని రూ.1,000కు పెంచారు.
ఫైన్ కట్టకపోతే ఏం జరుగుతుంది?
కొత్త నిబంధనల్లో మరో కీలక అంశం ఉంది. విధించిన రూ.1,000 జరిమానాను చెల్లించకపోతే, సంబంధిత వ్యక్తిని అధికార పరిధి ఉన్న కోర్టు ముందు హాజరుపరచవచ్చు. అక్కడ రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
జరిమానా ఎవరు వసూలు చేస్తారు?
నిబంధనల ప్రకారం స్టేషన్ మాస్టర్ లేదా స్టేషన్ మేనేజర్, కమర్షియల్ విభాగానికి చెందిన టికెట్ కలెక్టర్ స్థాయి లేదా అంతకంటే పైస్థాయి అధికారులు, ఆపరేటింగ్ విభాగంలో సమాన హోదా కలిగిన అధికారులు, అలాగే రైల్వే పరిపాలన ప్రత్యేకంగా అధికారం ఇచ్చిన ఇతర అధికారులు జరిమానా వసూలు చేయవచ్చు.


