డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రంగంలో మరో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పరస్పర భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. యూట్యూబ్ షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో భాగంలో అమెజాన్‌ను అనుసంధానించడం ద్వారా అమెరికాలోని ఎంపిక చేసిన క్రియేటర్లకు బంపర్ ఆఫర్ దక్కింది.
ఇకపై క్రియేటర్లు తమ వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్, లైవ్‌స్ట్రీమ్‌ల్లో అమెజాన్ ఉత్పత్తులను నేరుగా టాగ్ చేయవచ్చు. వీడియో డిస్క్రిప్షన్‌లో ఎక్స్‌టర్నల్ లింక్‌లు వెతుక్కునే పనిలేకుండా వీక్షకులు స్క్రీన్‌పై ఉన్న ‘షాపింగ్’ బటన్ క్లిక్ చేసి నేరుగా అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. తద్వారా జరిగే అమ్మకాలపై క్రియేటర్లు మరింత కమిషన్ పొందుతారు.
ఈ సౌలభ్యం పొందేందుకు క్రియేటర్లు యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌తో పాటు అమెజాన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లేదా అసోసియేట్స్ ప్రోగ్రామ్‌లో సభ్యులై ఉండాలి. అంతేకాకుండా తమ యూట్యూబ్ ఛానెల్‌ను అమెజాన్ అకౌంట్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. వీడియోలలో ప్రోడక్ట్ టాగింగ్‌తో పాటు యూట్యూబ్ ఆటో-టాగింగ్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. క్రియోటర్ల రాబడి గణాంకాలు ‘యూట్యూబ్ స్టూడియో అనలిటిక్స్’లో నమోదుకాగా, ఫైనల్ అయిన కమిషన్లు నేరుగా యాడ్‌సెన్స్ ఖాతా ద్వారా జమ అవుతాయి.
సాధారణ ప్రకటనల రాబడిపై మాత్రమే ఆధారపడకుండా కంటెంట్ ద్వారా వాణిజ్యాన్ని విస్తరించే దిశగా ఈ నిర్ణయం కీలక పరిణామం. టిక్‌టాక్ షాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల పోటీని తట్టుకునేందుకు యూట్యూబ్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు గ్లోబల్ ఈ-కామర్స్ స్వరూపాన్నే మార్చనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ విధానం భారతదేశం సహా ఇతర దేశాలకు విస్తరించే అవకాశముంది.
ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు!


