పండుగల సీజన్ షాపింగ్ మొదలవుతున్న తరుణంలో ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫాంలపై విక్రయించే సెల్లర్స్‌కి షాకిచ్చాయి. ఆర్డర్ల రద్దుకు సంబంధించి సెల్లర్ ఫీజులు, పెనాల్టీలు పెరిగే విధంగా విధానాలను సవరించాయి. అమెజాన్ ఇండియా తమ సెల్లర్ ఫోరంలో ఉంచిన నోటీసు ప్రకారం కంపెనీ తమ ఈజీ షిప్, సెల్ఫ్ షిప్ సర్వీసులను ఉపయోగించుకునే సెల్లర్లకు సంబంధించి ఆర్డర్ క్యాన్సిలేషన్ ఫీజులను లెక్కించే విధానాన్ని మార్చింది. ఇది ఆగస్టు 17 నుంచి అమల్లోకి తెచ్చింది.
ఈజీ షిప్ కింద విక్రేతలు తమ ఉత్పత్తులను తామే నిల్వ చేసుకుని, ఆర్డరు వచ్చినప్పుడు ప్యాక్ చేసి, ఈజీ షిప్ పికప్ ఎగ్జిక్యూటివ్‌కి అందిస్తారు. వారు ఆ ప్రోడక్టును సకాలంలో డెలివరీ అయ్యేలా చూస్తారు. ఇక సెల్ఫ్ షిప్ విషయానికొస్తే విక్రేత స్వయంగా తమ కొరియర్ లేదా డెలివరీ సర్వీసును ఉపయోగించి కొనుగోలుదారులకు ప్రోడక్టును చేరవేస్తారు. ఇందులో అమెజాన్ లాజిస్టిక్స్ ప్రమేయమేమీ ఉండదు. ఇప్పటివరకు కేటగిరీ రిఫరల్ చార్జీ ఆధారంగా ఉండే ఫీజులు, ఇకపై ఆర్డరు విలువలో ఇంత శాతం అని లెక్కించనున్నట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది.
సవరించిన విధానం ప్రకారం రూ. 10,000 లోపు విలువ చేసే ఆర్డర్లపై 10 శాతం చార్జీ ఉంటుంది. రూ. 10,001 నుంచి రూ. 50,000 వరకు ఆర్డర్లపై 8 శాతంగా, అక్కడి నుంచి రూ. 1,00,000కు విలువ చేసే ఆర్డర్లపై 5 శాతం, అంతకు మించిన వాటిపై 2 శాతంగా చార్జీలు ఉంటాయి. 18 శాతం జీఎస్‌టీ అదనంగా ఉంటుంది. కొనుగోలు అభ్యర్ధన మేరకు కాకుండా ఇతరత్రా ఏవైనా కారణాల వల్ల విక్రేత క్యాన్సిల్ చేసినా ఈ చార్జీలు వర్తిస్తాయి. ముందుగా పేర్కొన్న షిప్పింగ్ తేదీకి 24 గంటల్లోపల విక్రేత పంపించకపోతే ఆర్డర్ ఆటోమేటిక్‌గా రద్దయిపోతుంది.
క్లోజింగ్ ఫీజు పెంపు..
ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్, ఈజీ షిప్, సెల్లర్ ఫ్లెక్స్ మాధ్యమాలవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి క్లోజింగ్ ఫీజులను పెంచనున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ఉత్పత్తి ధర శ్రేణిని బట్టి అమెజాన్‌లో ఉత్పత్తిని విక్రయించిన ప్రతిసారి క్లోజింగ్ ఫీజును కంపెనీ విధిస్తుంది. రూ. 500 వరకు ధర ఉండే ఉత్పత్తులపై ఫీజు రూ. 1 చొప్పున, రూ. 500కి మించిన ధర ఉండే వాటిపై రూ. 3 చొప్పున పెంపు ఉంటుంది. ఇంధన, లాజిస్టిక్స్ వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది.
మరోవైపు, ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్‌లో లోపాలకు సంబంధించి మూడంచెల పెనాల్టీ విధానానాన్ని ఫ్లిప్‌కార్ట్ ఆగస్టు 23 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం హామీ ఇచ్చిన డిస్పాచ్ డేట్ (డీబీడీ) కల్లా పికప్ చేసుకోవడానికి ఉత్పత్తిని సిద్ధం చేయకపోతే, ప్రతి షిప్‌మెంట్‌పై రూ. 30 జరిమానా ఉంటుంది. ఆర్డరును విక్రేత క్యాన్సిల్ చేసినా, లేదా మూడు సార్లు డిస్పాచ్ గడువు దాటిపోయి క్యాన్సిల్ అయిపోయినా ఒక్కో షిప్‌మెంట్‌కి రూ. 60 పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ ఆర్డరులో జాప్యం జరిగి, తదుపరి రద్దయిపోతే పెనాల్టీ రూ. 90కి పెరుగుతుంది. గతంలోనైతే డీబీడీని ఉల్లంఘిస్తే కొంత సమయం పాటు విక్రేత అకౌంటును లాక్ చేసేసేవారు.
ఫలితంగా విక్రేత వ్యాపారంపై గణనీయంగా ప్రభావం పడేది. ఫ్లిప్‌కార్ట్‌లో కొత్తగా చేరిన విక్రేతలకు తాజా విధానం వర్తించదు. సెల్లర్లు మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకునేందుకు, కస్టమర్ అనుభూతిని మరింత మెరుగుపర్చేందుకే ఈ మార్పులు, చేర్పులను ఉద్దేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీబీడీ నిబంధనలు సరిగ్గా పాటించే వారికి వేగంగా చెల్లింపులు జరపడం, కాంప్లిమెంటరీగా అడ్వరై్టజింగ్ క్రెడిట్స్ ఇవ్వడం మొదలైన రూపాల్లో ప్రయోజనాలు కూడా ఉంటాయని వివరించాయి.
‘మా ప్లాట్‌ఫాం ద్వారా కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లను విక్రేతలు విశ్వసనీయంగా డెలివరీ చేయాలని మేము ఆశిస్తాం. సకాలంలో, విశ్వసనీయతతో ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండేలా చూసేందుకే ఈజీ షిప్, సెల్ఫ్–షిప్ సెల్లర్లకు సంబంధించిన క్యాన్సిలేషన్ ఫీజులను సవరించాం. దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆర్డరును విక్రేత క్యాన్సిల్ చేసినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అమెజాన్‌డాట్‌ఇన్‌లో వచ్చే ఆర్డర్లలో వీటి వాటా 1 శాతం కన్నా తక్కువే. విక్రేతల పరిధిలో లేని అంశాల వల్ల ఆర్డరు రద్దయిన పక్షంలో వారు నష్టపోకుండా చూసేందుకు తగు జాగ్రత్త చర్యలు కూడా అమలు చేస్తున్నాం‘ అని అమెజాన్ ప్రతినిధి తెలిపారు.
మాపై భారం సరికాదు..
ఒకోసారి డెలివరీ సిబ్బంది సకాలంలో రాకపోవడం వల్ల కూడా ఆర్డరు రద్దయ్యే అవకాశం ఉంటుందని, ఇలా తమ పరిధిలో లేని అంశాలకు కూడా తమనే బాధ్యులను చేస్తే ఎలా అని కొత్త విధానాలను కొందరు విక్రేతలు అంటున్నారు. అలాంటి సందర్భాల్లో క్యాన్సిలేషన్ ఫీజులను తమపైనే మోపడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఒకే ఉత్పత్తికి సంబంధించి అమెజాన్‌కి చెందిన ఫుల్‌ఫిల్‌మెంట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే విక్రేతలు, ఈజీ షిప్‌ని ఉపయోగించుకునే సెల్లర్లు కట్టే ఫీజుల మధ్య ఒక్కో యూనిట్‌కి దాదాపు రూ.45 మేర వ్యత్యాసం ఉంటుందని, దీనివల్ల విక్రేతలకు సమాన అవకాశాలు లభించవని వారు పేర్కొన్నారు.
అత్యుత్తమ సర్వీస్ ప్రమాణాల ఆవశ్యకతను విక్రేతలు అర్థం చేసుకోగలరని, కాకపోతే సరిగ్గా పండుగ సీజన్ ముందు క్యాన్సిలేషన్ తదితర పెనాల్టీలను ఈ–కామర్స్ సంస్థలు పెంచేయడమనేది ఆందోళనకరమైన విషయమని ఫోరం ఫర్ ఇంటర్నెట్ రీసెల్లర్స్, సెల్లర్స్ అండ్ ట్రేడర్స్ (ఫస్ట్ ఇండియా) ట్రస్టీ వినోద్ కుమార్ తెలిపారు. చాలా తక్కువ మార్జిన్లు, పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న చిన్న, మధ్య తరహా సంస్థలపై దీని ప్రభావం భారీగా ఉంటుదన్నారు. ఆర్డర్లు రద్దు కావడానికి, జాప్యానికి సంబంధించి ప్రతి దానికీ విక్రేతే కారణం కాబోరని.. లాజిస్టిక్స్ వైఫల్యం, ప్లాట్‌ఫాంలో సమస్యలు, డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, కస్టమర్ల వైపు నుంచి ఉండే సవాళ్లు కూడా కారణంగా ఉంటాయని వివరించారు.


