తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని శక్తి మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. జపాన్ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తెలంగాణలో జపాన్ కంపెనీల పెట్టుబడులు సురక్షితంగా, లాభదాయకంగా ఉండేలా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
ఒసాకాలో Career Consultz వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ రావు నిర్వహించిన ‘Leveraging Indian Talent’ ఇండియా-జపాన్ వర్క్‌ఫోర్స్ రౌండ్‌టేబుల్‌లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జపాన్ వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ, విద్యా సంస్థల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులు, నైపుణ్య మానవ వనరులు, ఉపాధి అవకాశాలు, టాలెంట్ మొబిలిటీపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలతో పాటు నైపుణ్యవంతులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఐటీ, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో రాష్ట్రానికి బలమైన టాలెంట్ పూల్ ఉందన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కోరారు. పెట్టుబడులకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు, ప్రభుత్వ సహకారం అందిస్తూ వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో సుమారు 600 ఎకరాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు జపాన్ సంస్థలు ఆసక్తి చూపుతున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇది తెలంగాణపై జపాన్ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మరిన్ని జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.
పెట్టుబడులతో పాటు తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జపాన్ సంస్థలతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. జపాన్‌లో పెరుగుతున్న నైపుణ్య మానవ వనరుల అవసరాలను తెలంగాణ టాలెంట్‌తో అనుసంధానం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ యువత కొత్త దేశాలకు, కొత్త వాతావరణాలకు త్వరగా అలవాటు పడే స్వభావం కలిగి ఉంటారని మంత్రి అన్నారు. కష్టపడి పనిచేయడం, కొత్త విషయాలను వేగంగా నేర్చుకోవడం, పనిచేసే సంస్థలు, దేశాల సంస్కృతికి అనుగుణంగా మారడం తెలంగాణ యువత ప్రత్యేకతలని తెలిపారు. జపాన్ కంపెనీల అభివృద్ధికి తెలంగాణ యువత గణనీయంగా దోహదపడగలరని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 120 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే యువతకు ఆయా దేశాల భాషపై పరిజ్ఞానం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అందుకే టామ్‌కామ్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు భాషా శిక్షణ, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు, పని సంస్కృతిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తద్వారా తెలంగాణ యువత అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లో సులభంగా ఉపాధి పొందేలా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జర్మనీతో నైపుణ్య మానవ వనరుల రంగంలో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుందని మంత్రి తెలిపారు. ఇటీవల జర్మనీ బృందం తెలంగాణలో పర్యటించినప్పుడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. తెలంగాణ చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారని తెలిపారు. జర్మనీలో నైపుణ్య మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో తెలంగాణ యువతకు మరిన్ని అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
నైపుణ్య మానవ వనరుల నియామకం, శిక్షణ, ఉపాధి కల్పనలో జపాన్ సంస్థలతో మరింత బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. భారత్–జపాన్ సంబంధాల్లో వర్క్‌ఫోర్స్ మొబిలిటీ కీలక అంశంగా మారుతోందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో భారత్–జపాన్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రౌండ్‌టేబుల్ సమావేశం దోహదపడుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.


