"సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు" | Uttam Kumar Reddy held a video conference with senior officials | Sakshi
Sakshi News home page

"సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు"

Aug 25 2026 9:24 PM | Updated on Aug 25 2026 9:29 PM

Uttam Kumar Reddy held a video conference with senior officials

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం–పునర్నిర్మాణం, అటవీ అనుమతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ అవసరాల కోసం దాదాపు రూ.6 వేల కోట్లు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ రోజు (మంగళవారం )జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, నీటిపారుదల, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతులు, పరిహారం చెల్లింపులు, పెండింగ్ ప్రక్రియలపై సమగ్రంగా సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి  ఈ అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారని, నిధుల కొరత కారణంగా రాష్ట్రంలోని ఏ సాగునీటి ప్రాజెక్టు పనులూ నిలిచిపోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ సమస్యల పరిష్కారానికి ఎంత నిధులు అవసరమైనా ప్రభుత్వం తక్షణమే సమకూర్చేందుకు సిద్ధంగా ఉంది. అధికారులు ప్రక్రియను పూర్తి చేసి టోకెన్లు సమర్పించండి. నిధులు సమకూర్చే బాధ్యత మాపై వదిలేయండని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ సంబంధిత అవసరాలకు దాదాపు రూ.6 వేల కోట్లు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే తొలి విడతలో సుమారు రూ.1,056 కోట్లు, అనంతరం మరో రూ.1,500 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ సంబంధిత పెండింగ్ ప్రక్రియలను రాబోయే నెల నుంచి నెలన్నర వ్యవధిలో గణనీయంగా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన ప్రతిపాదనలు, అవార్డులు, టోకెన్ల ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు.

“మీరు ప్రక్రియ పూర్తి చేయండి... టోకెన్లు సమర్పించండి. డబ్బులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది. నిధుల కారణంగా ఒక్క పని కూడా ఆగకూడదు” అని మంత్రి స్పష్టం చేశారు. పీడీ ఖాతాలో కాదు...ప్రభుత్వం నిధులు విడుదల చేసి జిల్లా ఖాతాలకు పంపించడంతోనే బాధ్యత పూర్తయినట్లు భావించరాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. డబ్బులు కలెక్టర్ పీడీ ఖాతాలోనో, మరో ప్రభుత్వ ఖాతాలోనో ఉండిపోతే నిధులు విడుదల చేసిన ప్రయోజనం ఏముంటుంది? భూమి కోల్పోయిన రైతు, నిర్వాసిత కుటుంబం చేతికి పరిహారం చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు” అని స్పష్టం చేశారు.

జిల్లా, భూసేకరణ కార్యాలయాలకు చేరిన నిధులను అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. భూసేకరణలో ప్రభుత్వ విజయాన్ని ఖాతాల్లో ఉన్న నిధులతో కాకుండా భూములు కోల్పోయిన వారికి వాస్తవంగా అందిన పరిహారంతోనే కొలుస్తామని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు 40 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని, ఇందుకు సుమారు రూ.6,150 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.1,000 కోట్లకు పైగా నిధులు వివిధ భూసేకరణ కార్యాలయాలు, జిల్లా ఖాతాల్లో వివిధ దశల్లో ఉండి పంపిణీ కావాల్సి ఉందని సమీక్షలో వెల్లడైంది.

రోజూ కొన్ని నిమిషాలు భూసేకరణకే కేటాయించండి

ప్రతి జిల్లా కలెక్టర్ రోజూ కొన్ని నిమిషాలు భూసేకరణ పురోగతిని వ్యక్తిగతంగా సమీక్షించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, భూసేకరణ అధికారులు, నీటిపారుదల ఇంజినీర్ల మధ్య తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.చీఫ్ ఇంజినీర్లు కూడా తమ బాధ్యతను కేవలం సాంకేతిక అంశాలకే పరిమితం చేసుకోకుండా, భూసేకరణ నుంచి ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతుల వరకు ప్రతి అంశంలో చొరవ చూపాలని సూచించారు.

అవార్డులు పూర్తయిన వెంటనే మ్యూటేషన్‌, ఎన్‌కంబ్రెన్సుల తొలగింపు, సేకరించిన భూమిని అధికారికంగా నీటిపారుదల శాఖకు అప్పగించడం వంటి ప్రక్రియలను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement