హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ తాజాగా భారత ఆర్మీకి చెందిన సెంట్రల్ కమాండ్‌తో కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రక్షణ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్న స్టార్టప్‌లకు సైన్యంతో కలిసి నేరుగా క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పిస్తుంది. భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు సరికొత్త సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, వాటిని ధ్రువీకరించడానికి ఇది దోహదపడనుంది.
భారత ఆర్మీ వెస్ట్రన్ కమాండ్‌తో టీ హబ్‌కు ఇప్పటికే ఉన్న భాగస్వామ్యానికి కొనసాగింపుగా ఈ తాజా ఒప్పందం నిలిచింది. దీంతో కమాండ్ స్థాయిలో రక్షణ దళాలతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన అతికొద్ది జాతీయ సంస్థలలో టీ హబ్ ఒకటిగా చేరింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐడెక్స్ పథకాన్ని అమలు చేస్తున్న 28 సంస్థలలో టీ హబ్ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందింది.
ఇప్పటివరకు 100కు పైగా రక్షణ స్టార్టప్‌లతో పనిచేస్తూ, 70కి పైగా ఛాలెంజ్‌లను పూర్తిచేసింది. ఈ పథకం ద్వారా టీ హబ్ స్టార్టప్‌లు రూ.4.2 కోట్లకు పైగా గ్రాంట్లు, రూ.9 కోట్ల విలువైన ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ డెలివరీల సహకారంతో సుమారు రూ.250 కోట్లకు పైగా వాణిజ్య రక్షణ ఆర్డర్లను సాధించాయి. ఈ భాగస్వామ్యం కింద ఆర్మీ సెంట్రల్ కమాండ్ అందించే నిర్దిష్ట సమస్యలను పరిష్కరించే స్టార్టప్‌లను టీ-హబ్ ఎంపిక చేస్తుంది. స్టార్టప్‌లు, సైనిక భాగస్వాముల మధ్య కార్యక్రమాల సమన్వయాన్ని ఒక సంయుక్త పర్యవేక్షణ కమిటీ పర్యవేక్షిస్తుంది.
ఈ సందర్భంగా టీ-హబ్ సీఈవో కవికృత్ మాట్లాడుతూ ‘సాంకేతికతలు క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా ఉండాలంటే వ్యవస్థాపకులకు సైన్యంతో ప్రత్యక్ష సమన్వయం తప్పనిసరి. ఈ ఒప్పందం దానికి మార్గం సుగమం చేస్తుంది. భారతీయ రక్షణ స్టార్టప్‌ల నైపుణ్యంతో పాటు సంక్లిష్ట అవసరాలను తీర్చే సాంకేతికతలను రూపొందించడంలో హైదరాబాద్ సామర్థ్యంపై ఉన్న నమ్మకాన్ని ఇది తెలియజేస్తోంది’ అని పేర్కొన్నారు. దేశీయ సాంకేతికతలను ప్రోత్సహించడానికి భారత సైన్యం కట్టుబడి ఉందని సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి తెలిపారు. క్షేత్రస్థాయి అవసరాలను తీర్చే స్టార్టప్‌ల ఆవిష్కరణలు సాయుధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయని వివరించారు.
ఇది కూడా చదవండి: ఓణం హిందూ పండుగ కాదా?.. తెరపైకి కొత్త చర్చ!


