10వ ఏడాదిలోకి రోహింగ్యా సంక్షోభం.. చేతులెత్తేసిన బంగ్లాదేశ్‌! | Rohingya Crisis Enters 10th Year, Bangladesh Urges Global Pressure On Myanmar For Safe Repatriation, Check More Details | Sakshi
Sakshi News home page

10వ ఏడాదిలోకి రోహింగ్యా సంక్షోభం.. చేతులెత్తేసిన బంగ్లాదేశ్‌!

Aug 25 2026 9:15 AM | Updated on Aug 25 2026 9:26 AM

Rohingya Crisis Enters 10th Year Bangladesh Urges Global Pressure on Myanmar for Safe Repatriation

కాక్స్‌ బజార్‌: రోహింగ్యా శరణార్థుల సంక్షోభం 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ, వారిని సురక్షితంగా స్వదేశానికి పంపించేందుకు మయన్మార్‌పై అంతర్జాతీయ సమాజం దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగించాలని బంగ్లాదేశ్‌ విజ్ఞప్తి చేసింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సంక్షోభ భారాన్ని తమ దేశం ఒక్కటే నిరవధికంగా మోయలేదని స్పష్టం చేసింది. నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ (ఎన్‌ఆర్‌సీ), రెఫ్యూజీ రిలీఫ్ అండ్ రీపాట్రియేషన్ కమిషనర్ (ఆర్‌ఆర్‌ఆర్‌సీ)సంయుక్తంగా కాక్స్‌ బజార్‌లో నిర్వహించిన సదస్సులో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి అసద్ ఆలం సియామ్ ప్రసంగించారు.

రోహింగ్యాలు గౌరవప్రదంగా, సురక్షితంగా స్వదేశానికి వెళ్లేందుకు అనువైన పరిస్థితులు కల్పించేలా మయన్మార్‌పై బలమైన రాజకీయ, దౌత్య ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. శరణార్థి శిబిరాలకు అంతర్జాతీయ నిధులు తగ్గుముఖం పడుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల సమీకరణకు అంతర్జాతీయ భాగస్వాములతో చర్చిస్తున్నామని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, దాతృత్వ సంస్థలు, ఎన్జీవోలు పాల్గొన్న ఈ సమావేశంలో రోహింగ్యాల సంక్షోభ పరిష్కారానికి నిర్దిష్ట గడువుతో కూడిన కార్యాచరణ ప్రణాళిక అవసరమని ప్రతినిధులు పేర్కొన్నారు.

రోహింగ్యాల పునరావాసం కోసం విద్య, వృత్తి నైపుణ్యాలు, డిజిటల్ లెర్నింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని వక్తలు సూచించారు. స్వచ్ఛంద, సురక్షిత, గౌరవప్రదమైన పునరావాసమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని పునరుద్ఘాటించారు. గత నెల న్యూఢిల్లీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన జరిగిన ‘బిమ్‌స్టెక్’ భద్రతా అధిపతుల సమావేశంలోనూ బంగ్లాదేశ్ ఈ అంశాన్ని లేవనెత్తింది. బంగాళాఖాతం ప్రాంత భద్రత, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, రోహింగ్యాల సంక్షోభ పరిష్కారానికి సభ్యదేశాలన్నీ ఉమ్మడిగా కృషి చేయాలని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ రక్షణ సలహాదారు డాక్టర్ షంసుల్ ఇస్లాం పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: మధ్యాహ్న భోజనం వికటించి 27 మంది విద్యార్థులకు అస్వస్థత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement