లక్నో: యూపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కుటుంబంలో రాజకీయ విభేదాలు తీవ్రస్థాయి కుటుంబ కలహాలకు దారితీశాయి. ఆయన అల్లుడు షయాన్ మసూద్ కాంగ్రెస్‌ను వీడి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరిన కొద్ది రోజులకే ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఎంపీ కుమార్తె సుబియాపై ఆమె భర్త షయాన్ దాడి చేసి, ఇంటి నుంచి గెంటేశాడని ఇమ్రాన్ మసూద్ మేనల్లుడు హంజా నోమన్ మసూద్ తీవ్ర ఆరోపణలు చేశారు.
శనివారం నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్‌లో హంజా మాట్లాడుతూ.. షయాన్, ఆయన తండ్రి షాదాన్ మసూద్‌లు సుబియాపై భౌతిక దాడికి పాల్పడటంతో పాటు దూషించి ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. సంబంధాలు, కుటుంబ పరువు కోసం దాదాపు ఐదేళ్లుగా మౌనంగా ఉన్నామని, రాజకీయ విభేదాల కారణంగానే సుబియాను వేధించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సంభాషణల ఆడియోలు, వీడియో రికార్డింగ్‌లు తమ వద్ద ఉన్నాయని, వివాదం ఇలాగే కొనసాగితే వాటిని బహిర్గతం చేస్తామని హెచ్చరించారు.
చిన్నారి ప్రాథమిక అవసరాలు, డైపర్ల ఖర్చులను కూడా షయాన్ భరించలేదని విమర్శించారు. అంతేకాకుండా తనను, ఇమ్రాన్ మసూద్‌ను అంతమొందించేందుకు జరిగిన సంభాషణల రికార్డింగులు కూడా ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు రుజువులు చూపించలేదు. ఈ ఆరోపణలపై షయాన్ స్పందిస్తూ.. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను బహిరంగ పరచడం సరికాదన్నారు. రాజకీయ పోరాటం చేయాలనుకుంటే ప్రత్యక్షంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. కుటుంబ విషయాలను రచ్చకెక్కించడం ఇష్టం లేదని, ప్రైవేట్‌గా చర్చిస్తే, అన్ని ఆరోపణలకూ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆగస్టు 20న లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలో షయాన్ ఎస్పీలో చేరారు.


