Ayodhya: శ్రావణ మాసంలో చేపల కూరా? | Fish Feast in Ayodhya Sparks Row During Sawan Month | Sakshi
Sakshi News home page

Ayodhya: శ్రావణ మాసంలో చేపల కూరా?

Aug 24 2026 9:16 AM | Updated on Aug 24 2026 9:29 AM

Fish Feast in Ayodhya Sparks Row During Sawan Month

పవిత్రమైన శ్రావణ మాసంలో అందునా.. అయోధ్య నగరంలో చేపల వంటకాల భోజనాలు ఏర్పాటు చేయడంపై కొందరు సాధువులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాముడు కొలువై ఉన్నచోట ఇలాంటి పనులు చేయడం ఘోర పాపమేనని తిట్టిపోస్తున్నారు. అయితే కార్యక్రమ నిర్వాహకుడు మాత్రం వ్యక్తిగత ఆహార స్వేచ్ఛ, సంప్రదాయాల పేరుతో ఈ ఏర్పాటును సమర్థించారు.

అయోధ్య రామ మందిర విరాళాల గోల్‌మాల్‌ వివాదం కొనసాగుతున్న వేళ.. ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌ ఆదివారం అయోధ్యలో పర్యటించారు. తొలుత ఆయన శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్‌ గఢీ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తరుణ్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ నేత రామ్‌ నిహాల్‌ నిషాద్‌ ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అజయ్‌ రాయ్‌తో పాటు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రాజ్‌పాల్‌ గౌతమ్‌, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అఖిలేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, పూర్వాంచల్‌ ఇన్‌చార్జ్‌ అభిషేక్‌ దత్‌ తదితరులు హాజరయ్యారు.

అయితే ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అతిథుల కోసం రకరకాల వంటకాలు సిద్ధం చేయించారు. అందులో.. చేపల వంటకాలు స్పెషల్‌కాగా.. అదే వివాదానికి దారి తీసింది.

వీడియోతో మొదలైన వివాదం
కార్యక్రమ వేదిక వద్ద చేపలు వండుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలు కొందరు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేశారు.  భారీ వర్షం పడుతున్న సమయంలోనే అక్కడ చేపలను తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయోధ్యలో చేపల కూర వడ్డింపుపై కొందరు స్థానిక సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రావణ మాసంలో అయోధ్య వంటి పవిత్ర ప్రాంతంలో చేపల విందు ఏర్పాటు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీస్తుందని వారు పేర్కొన్నారు.

ఏం తినాలో మీరే చెప్తారా?
అయితే కార్యక్రమ నిర్వాహకుడు రామ్‌ నిహాల్‌ నిషాద్‌ ఈ విమర్శలను తోసిపుచ్చారు. రాజ్యాంగం ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన ఆహారం తీసుకునే హక్కును కల్పించిందని అన్నారు. సమాజంలో చేపల వేట, చేపలు తినడం సంప్రదాయంలో భాగమని పేర్కొన్న ఆయన.. శ్రావణం, భాద్రపదం వంటి నెలల పేరుతో వ్యక్తుల ఆహార అలవాట్లను ప్రశ్నించకూడదని వ్యాఖ్యానించారు.

రాజకీయ దుమారం
తన అయోధ్య పర్యటనలో చెలరేగిన ఈ దుమారంపై అజయ్‌ రాయ్‌ స్పందించారు. దేశంలో అణచివేత, అన్యాయం కొనసాగుతోందని యూపీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రామాలయంలో సమర్పించిన కానుకల విషయంలోనూ ఆయన ఆరోపణలు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని జైలుకు పంపాలని హనుమంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అయితే అయోధ్యలో చేపల విందు వివాదం ప్రస్తుతం ఆహార స్వేచ్ఛ, మత విశ్వాసాలు, రాజకీయ విమర్శల చుట్టూ కొత్త చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: అతను సీఎం పదవికి అన్నివిధాల అర్హుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement