‘జనగణమన’ మధ్యలోనే వెళ్లిపోయిన స్పీకర్‌  | UP Assembly Speaker Satish Mahana Faces Row Over National Anthem | Sakshi
Sakshi News home page

‘జనగణమన’ మధ్యలోనే వెళ్లిపోయిన స్పీకర్‌ 

Aug 24 2026 5:35 AM | Updated on Aug 24 2026 5:35 AM

UP Assembly Speaker Satish Mahana Faces Row Over National Anthem

ఉన్నావ్‌: ఉత్తరప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ సతీశ్‌ మహానా అనూహ్య చర్య వివాదానికి దారి తీసింది. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహానా జాతీయ గీతం ఆలాపన పూర్తి కాకుండానే వేదిక దిగి, అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఉన్నావ్‌లోని ఎస్‌వీఎం ఇంటర్‌ కాలేజీలో జరిగిన సెమినార్‌కు ఆయన హాజరయ్యారు. పోలీసులు స్పీకర్‌కు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జనగణమన గీతాలాపన మొదలైంది. కొన్ని క్షణాల పాటు అక్కడే అటెన్షన్‌లో నిల్చున్న స్పీకర్‌ వెంటనే వెనుదిరిగి, వేదిక నుంచి కిందికి చేరుకున్నారు. అక్కడే సిద్ధంగా ఉన్న తన కారులో వెళ్లిపోయారు. 

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వందేమాతరం పూర్తి ఆరు చరణాలకు బదులుగా గతంలో మాదిరిగానే రెండు చరణాలను మాత్రమే తాము ఆలపిస్తామంటూ కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీనిపై కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం చీఫ్‌ సుప్రియా శ్రీనాథే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌.. బ్రిటిష్‌ ఇన్ఫార్మర్‌లు అని విరుచుకుపడ్డారు. ‘గొప్ప బీజేపీ నేత, స్పీకర్‌ మహానా జాతీయ గీతం మధ్యలోనే ఎందుకు వెళ్లిపోయారు? కనీసం 52 సెకన్లు కూడా వేచి ఉండే సమయం ఆయనకు లేదా? జనగణమనను ఆయన అవమానించారు. మహానా క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement