న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన 28 ఏళ్ల గుర్దీప్ సింగ్ దాదాపు పదేళ్లుగా క్వీన్స్‌లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఆయన పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి అతడితో ఘర్షణ పడ్డాడు. ఈ సమయంలో తుపాకీతో గుర్దీప్‌పై కాల్పులు జరిపి కారులో పరారయ్యాడు.
ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన గుర్దీప్ ప్రాణాలు విడిచారు. ఈ ఘటనను అమెరికాకు చెందిన నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. దీనిని కేవలం ఓ సాధారణ కాల్పుల ఘటనగా వదిలేయ వద్దని, పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి, కారణాలు కనుగొనాలని డిమాండ్ చేసింది.


