మోదీ హయాంలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజెప్పాలి
బీజేపీ శ్రేణులకు నబీన్ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రధానిగా 12 ఏళ్లు అందించిన సుపరిపాలన, అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజెప్పడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కమిటీ సమావేశానికి కొనసాగింపుగా.. ఆదివారం పదాధికారుల విస్తృతస్థాయి సంస్థాగత సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి నితిన్ నబీన్ అధ్యక్షత వహించారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో సహా ఏడు రాష్ట్రాల్లో జరగనున్న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు పలు సంస్థాగత అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులపాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ను ఒక మహత్తర ప్రజా ఉద్యమంగా చేపట్టాలని బీజేపీ శ్రేణులకు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ హయాంలో పెను మార్పులు సాధించిన ‘నయా భారత్’రూపురేఖలను, వాస్తవాలను, గణాంకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు.
పేదల జీవితాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు, వేగంగా విస్తరించిన మౌలిక సదుపాయాలు, పేదరికం నుంచి కోట్లాది మంది బయటపడిన తీరు, ప్రపంచ వేదికపై భారత్‌కు దక్కుతున్న ప్రాధాన్యతను యువతకు తెలియజెప్పేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ‘సేవా సంకల్ప్ అభియాన్’స్ఫూర్తిని దేశంలోని అన్ని మూలలకు, అన్ని సామాజిక వర్గాలకు చేరవేసేలా సమగ్ర కార్యాచరణను ఖరారు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బి.ఎల్.సంతోష్, జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, కొత్తగా నియమితులైన ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు.


