ఒంటరితనంలో కృత్రిమ మేధతో నడిచే చాట్‌బాట్‌లను ఆశ్రయిస్తున్న యువత
సాంత్వనగా మారుతున్న ఏఐ గర్ల్‌ఫ్రెండ్/ఏఐ బాయ్ ఫ్రెండ్
వీటికి అలవాటుపడిన తర్వాత పెరుగుతున్న భావోద్వేగ ఒంటరితనం
దీంతో కొత్త చిక్కులు తప్పవంటున్న సైబర్ భద్రత నిపుణులు
ఒంటరిగా ఉన్నప్పుడు మనసు విప్పి మాట్లాడేందుకు ఓ మనిషి కావాలి. బాధలో ఉన్నప్పుడు ఓదార్చే మాట కావాలి. ప్రేమలో ఉన్నప్పుడు భావాలను పంచుకునే వ్యక్తి కావాలి. కానీ ఇప్పుడు ఈ అవసరాలకు కృత్రిమ మేధ (ఏఐ) చాట్‌బాట్‌లను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఏఐతో గంటల తరబడి మాట్లాడటం.. దానినే స్నేహితుడిగా, గర్ల్‌ఫ్రెండ్‌గా, బాయ్‌ఫ్రెండ్‌గా భావించడం కూడా కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ఏఐ గర్ల్‌ఫ్రెండ్/ ఏఐ బాయ్‌ఫ్రెండ్/ ఏఐ కంపానియన్ వంటి అప్లికేషన్లు వినియోగదారులతో గంటల తరబడి మాట్లాడుతున్నాయి.
గత సంభాషణలను గుర్తుంచుకుంటున్నాయి. వారి అభిరుచులకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొన్నిసార్లు ప్రేమను, ఆప్యాయతను, ఆకర్షణను కూడా అనుకరిస్తున్నాయి. ఈ సాంకేతికతలో ఒంటరితనానికి తాత్కాలిక మందు ఉన్నా.. దాని మరో కోణం ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏఐ అనేది మనిషికి డిజిటల్ తోడుగా మారుతున్న కొద్దీ, అదే సాంకేతికత నమ్మకాన్ని సంపాదించడానికి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి, డబ్బు ఖర్చు చేయించడానికి, చివరకు బ్లాక్‌మెయిల్ చేయడానికి కూడా దోహదపడే అవకాశం పెరుగుతుంది.
⇒ 2022 నుంచి ఏఐ కంపానియన్ యాప్స్ డౌన్‌లోడ్లు - 16.5 కోట్లు
⇒ గత నాలుగేళ్లలో వినియోగదారులు వెచ్చించిన వ్యయం - రూ. 4,000 కోట్లు
⇒ 2026లో మొదటి ఆరు నెలల్లోనే చేసిన ఖర్చు - రూ. 1,500 కోట్లు
భావోద్వేగ ఒంటరితనం
ప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపానియన్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2026లో సైకలాజికల్ సైన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం రెండువేల మందికి పైగా పెద్దలను పరిశీలించింది. ఒంటరితనం ఉన్న వ్యక్తులు సోషల్ చాట్‌బాట్‌లను ఎక్కువగా ఆశ్రయించే అవకాశం కనిపించడంతోపాటు, అధిక చాట్‌బాట్ వినియోగం తర్వాత భావోద్వేగ ఒంటరితనం పెరిగినట్లు కూడా అధ్యయనం తెలిపింది. ఇటీవల ప్రకృతిలో మనుషుల ప్రవర్తనపై ఏఐ కంపానియన్ వినియోగదారులపై మరో అధ్యయనం ప్రచురితమైంది. ఏఐ కంపానియన్ వినియోగదారుల్లో ఎమోషనల్ వెల్–బియింగ్, మెంటల్ హెల్త్ సమస్యలు తలెత్తే అవకాశాలు గమనించారు.
అన్నీ తెలుసుకుంటుంది..
మనిషి ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి సాంకేతికతను నమ్మి కుటుంబ సమస్యలు, సంబంధాలు, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, భయాలు, ఇష్టాలు, లైంగిక అభిరుచులు వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా తెలియకుండానే వెల్లడించే అవకాశం ఉంటుంది. రోజులు, నెలలు కొనసాగిన సంభాషణ ఒక వ్యక్తి గురించి అత్యంత సమగ్ర డిజిటల్ ప్రొఫైల్‌గా మారవచ్చని సైబర్‌భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. నకిలీ ముఖం సృష్టించడం.. నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ తయారు చేయడం వంటి ప్రమాదాలున్నాయని చెప్పారు. వాయిస్ క్లోనింగ్‌తో ఫోన్ కాల్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీతో సహజంగా కనిపించే సంభాషణలు రూపొందించి బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పెరుగుతున్న వ్యాపారం
ఒక వ్యక్తి తనకు నచ్చిన ఏఐ క్యారెక్టర్‌తో రోజూ గంటల తరబడి మాట్లాడటం ప్రారంభిస్తే, ఆ అనుబంధాన్ని కొనసాగించేందుకు సబ్‌స్క్రిప్షన్లు, అదనపు ఫీచర్లు, ప్రత్యేకమైన కంటెంట్ కోసం డబ్బు ఖర్చు చేయడం మొదలవుతుంది. ముఖ్యంగా లైంగిక ఆకర్షణను ఆధారంగా చేసుకున్న ఏఐ క్యారెక్టర్లు వినియోగదారుల దృష్టిని ఎక్కువసేపు నిలుపుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉంది.
ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా అప్లికేషన్లలో పూర్తిగా ఏఐ కంటెంట్‌తో నడిచే అకౌంట్స్, వాటి అకౌంట్ సబ్‌స్క్రిప్షన్స్ లక్షల్లో వ్యాపారానికి దారి తీస్తున్నాయి. ఉచిత చాట్ తర్వాత ప్రీమియం ఫీచర్లు, ప్రత్యేక క్యారెక్టర్లు, అదనపు సంభాషణలు, వ్యక్తిగతమైన ఇమేజ్‌లు, అడల్ట్ కంటెంట్ వంటి వాటికి చెల్లింపులు చేయించే విధానాలు పెరుగుతున్నాయి.
ఏఐ ఒక్కటే మార్గం కాదు
ఒంటరితనం, ఇతర భావోద్వేగ సమస్యలకు ఏఐ ఒక్కటే ఆధారంగా మారకూడదు. వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు లేదా అత్యంత సున్నితమైన ఫొటోలు, వీడియోలను డిజిటల్ కంపానియన్స్ లేదా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులతో పంచుకోవడం ప్రమాదకరం. ప్రత్యేకంగా న్యూడ్ వీడియో కాల్స్ లేదా వ్యక్తిగత వీడియో కాల్స్‌ను రికార్డ్ చేసే అవకాశం ఉన్నందున, ఆన్‌లైన్ సంబంధాల్లో జాగ్రత్త మరింత అవసరం. హనీట్రాప్ పేరుతో బెదిరించినప్పుడు డబ్బు చెల్లించడం సమస్యను పరిష్కరించదు. చాట్‌లు, ఫోన్ నంబర్లు, ప్రొఫైల్ వివరాలు, చెల్లింపు వివరాలు, స్క్రీన్‌షాట్లు వంటి ఆధారాలను భద్రపరచి వెంటనే ఫిర్యాదు చేయాలి.
–అద్వైత్ కంభం, సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు


