వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులైనా నెరవేర్చలేదు
సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ సమరభేరికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ వేయి రోజులు పూర్తయినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
బాకీ కార్డులతో హామీల వైఫల్యం
రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువత తదితర వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ‘బాకీ కార్డుల’రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఆయా వర్గాలకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పేరుకుపోయిన బకాయిల వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కేవలం హామీలు అమలు కాలేదనే అంశానికే పరిమితం కాకుండా, 1,000 రోజుల పాలనలో ప్రభుత్వం వివిధ రంగాల్లో ఎదుర్కొన్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామాలు, వార్డు స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు. కొత్త తరానికి చేరువయ్యేలా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించి వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు సహా అన్ని స్థాయిల నాయకులు వారం రోజుల కార్యక్రమాల్లో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు.


