కేసు నుంచి తప్పించండి 'ఎంతైనా ఇస్తాం'! | Huge settlement with police in Janasena MP Ramesh Son Sanjush Case | Sakshi
Sakshi News home page

కేసు నుంచి తప్పించండి 'ఎంతైనా ఇస్తాం'!

Aug 24 2026 2:18 AM | Updated on Aug 24 2026 2:18 AM

Huge settlement with police in Janasena MP Ramesh Son Sanjush Case

జనసేన ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌ యాక్సిడెంట్‌ చేసిన కేసులో పోలీసులతో భారీ మొత్తంలో సెటిల్‌మెంట్‌  

నిందితుడి కుటుంబం, మాదాపూర్‌ ఠాణాలో ఓ ఉన్నతాధికారి ఒకే సామాజిక వర్గం కావడంతో సయోధ్య 

అందుకే ఘటన జరిగిన ఐదు రోజులపాటు దాచిపెట్టిన పోలీసులు 

ఎఫ్‌ఐఆర్‌లో అనుకూల సెక్షన్ల నమోదుపై అధికారులపై రాష్ట్ర పోలీసు బాస్‌ ఆగ్రహం 

భారతీముఖిని ఢీకొట్టిన సమయంలో కారు వేగం గంటకు 80 కి.మీ. 

నేడు పోలీసులకు చేరనున్న ఎంవీఐ సమగ్ర నివేదిక 

ఆ తర్వాత ఎంవీ యాక్ట్, బీఎన్‌ఎస్‌ కింద కొత్త సెక్షన్లు జోడించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: జనసేన ఎంపీ లింగమనేని రమేష్‌ కుమారుడు సంజూష్‌ యాక్సిడెంట్‌ చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు నుంచి తప్పిస్తే ఎంత పెద్ద మొత్తమైనా ఇస్తామని పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. మాదాపూర్‌ ఠాణాలో ఓ ఉన్నతాధికారి, లింగమనేని కుటుంబం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో భారీ మొత్తంలో సెటిల్‌మెంట్‌ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 16న హైదరాబాద్‌లో ఇనార్బిట్‌ మాల్‌ వద్ద లింగమనేని సంజూష్‌ తన ఆస్టన్‌ మార్టిన్‌ లగ్జరీ కారులో అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు దాటుతున్న లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ ఉద్యోగిని భారతీ ముఖిని ఢీకొట్టడంతో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసులు ఐదు రోజులపాటు ఈ రోడ్డు ప్రమాదం విషయాన్ని బయటికి పొక్కనివ్వకుండా గోప్యంగా ఉంచారు. ఈ సమయంలో మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లోని ఓ ఉన్నతాధికారి, పలువురు కింది స్థాయి సిబ్బందితో నిందితుడి కుటుంబ సభ్యులు సయోధ్య కుదుర్చుకున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. 

ఇందులో భాగంగానే నిందితుడు సంజూష్‌ స్థానంలో మరొక ప్రైవేట్‌ డ్రైవర్‌ను పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పటికే ఘటనాస్థలిలో స్థానికులు ఫోన్‌లో రికార్డ్‌ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఈనెల 21న మీడియాకు లీకులు ఇచ్చారు. అందుకే అతివేగం, నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు దాటుతున్న పాదచారి భారతీ మృతికి కారణమైన తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో కూడా పోలీసులు తూతూమంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. నిందితుడు సంజూష్‌ను వెంటనే అరెస్ట్‌ చేయకుండా, నోటీసులతో సరిపెట్టేశారు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి వదిలేశారు. కేవలం బీఎన్‌ఎస్‌ 106(1) కింద అనుకూల సెక్షన్‌ నమోదు చేశారు. కారుతో ఢీకొట్టి మరణానికి కారణమైన కేసులో మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

పోలీసు బాస్‌ సీరియస్‌ 
ఆర్ధిక, రాజకీయ పలుకుబడి ఉన్న లింగమనేని రమేష్‌ కుమారుడు కావడంతోనే సంజూష్‌పై అనుకూల సెక్షన్లు నమోదు చేశారంటూ పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర పోలీసు బాస్‌ సీరియస్‌గా తీసుకున్నారు. శనివారం మాదాపూర్‌ పీఎస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ), దర్యాప్తు అధికారి ఎస్‌ఐను కార్యాలయానికి పిలిపించుకొని కేసు నమోదు, దర్యాప్తు తీరు తదితరాలపై సమగ్ర వివరాలను సేకరించినట్లు తెలిసింది. కారు వేగం, తీవ్రమైన గాయాలతో భారతీ మృతి చెందిన తీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి సెక్షన్లు జోడించాలో తెలియదా? లేదా ఎవరి ఒత్తిడి, ప్రలోభాల వల్ల అనుకూల సెక్షన్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

రెట్టింపు వేగంతో ఢీ కొట్టి.. 
ఇప్పటికే జిల్లా రవాణా అధికారి (డీటీఓ) ఘటనాస్థలిని సందర్శించారు. నిందితుడు లింగమనేని సంజూష్‌ నడిపిన ఆస్టన్‌ మార్టిన్‌ లగ్జరీ స్పోర్ట్స్‌ కారు (టీజీ09 జీ0666)ను స్వా«దీనం చేసుకొని వాహన తనిఖీని పూర్తి చేశారు. రోడ్డు దాటుతున్న భారతీని కారు ఎడమ వైపు బలంగా తాకడంతో ఆమెకు తల, శరీర భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయని, అలాగే కారు ఎడమ వైపు బాగా డ్యామేజ్‌ అయినట్లు గుర్తించారు. భారతీని ఢీకొట్టిన తర్వాత కారును పక్కన నిలిపి, ఆపేయడంతో కారు వేగం స్పీడోమీటర్‌లో నమోదు కాలేదు. అలాగే ఘటనాస్థలం వద్ద ఎలాంటి సీసీటీవీ కెమెరాలు గానీ స్పీడో మీటర్లు గానీ లేకపోవడంతో కారు వేగాన్ని అధికారులు అంచనా వేయలేకపోయారు. అయితే మృతిరాలి తలకు, శరీర భాగాలకు తగిలిన గాయాలను బట్టి కారు 80 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇనార్బిట్‌ మాల్‌ వంటి రద్దీగా ఉండే నగర రోడ్లపై కార్ల సగటు నిర్దేశిత వేగం 40 కి.మీ.గా ఉండాలి. కానీ, సంజూష్‌ హైఎండ్‌ స్పోర్ట్స్‌ కారుతో మిట్ట మధ్యాహ్నం, బిజీ రోడ్డులో రెట్టింపు వేగంతో కారు నడపడం తీవ్రమైన నేరం కిందకి వస్తుంది. కారు చెట్టు, డివైడర్‌ వంటి బలమైన వాటికి ఢీకొడితే కారులోని బెలూన్స్‌ తెరుచుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. 

కొత్త సెక్షన్ల జోడింపు 
కారు నడిపిన లింగమనేని సంజూష్‌ ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ సమర్పించాలని పోలీసులను డీటీఓ కోరారు. సోమవారం చేతిరాతతో రాసిన సమగ్ర నివేదిక కాపీని దర్యాప్తు అధికారికి అప్పగిస్తామని సంబంధిత అధికారి ‘సాక్షి’కి తెలిపారు. అనంతరం మోటారు వాహన తనిఖీ (ఎంవీఐ) నివేదిక పరిశీలన తర్వాత సంజూష్‌పై కొత్త సెక్షన్లు జోడించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఘటన తీవ్రత దృష్ట్యా బీఎన్‌ఎస్‌తోపాటు మోటారు వాహన చట్టం కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పారు. 

సులువుగా బెయిల్‌ వచ్చేలా కేసు 
నిందితుడు సంజూష్‌పై మాదాపూర్‌ పోలీసులు కేవలం బీఎన్‌ఎస్‌ 106 (1) సెక్షన్‌ కింద మాత్రమే కేసు నమోదు చేశారు. అంటే అజాగ్రత్త లేదా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల జరిగిన సాధారణ ప్రమాదంగా దీన్ని పరిగణిస్తారు. ఇది పూర్తిగా బెయిలబుల్‌ నేరం. దీని కింద గరిష్టంగా ఐదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ.. నిందితుడికి పోలీస్‌ స్టేషన్‌ నుంచి లేదా కోర్టుకు వెళ్లిన వెంటనే సులువుగా బెయిల్‌ లభిస్తుంది. అయితే హైస్పీడ్‌ కారును బిజీ పబ్లిక్‌ ఏరియాలో నడుపుతున్నప్పుడు దాని వల్ల ఎదుటివారి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు ఆధారాలు ఉంటే బీఎన్‌ఎస్‌ 105 సెక్షన్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలి. 

ఈ సెక్షన్‌ కింద (మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసి చేసిన చర్య అయితే..) పదేళ్ల వరకు జైలు, జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. మోటార్‌ వాహన చట్టం 184 సెక్షన్‌ చేర్చడం కూడా కీలకమే. ఈ సెక్షన్‌ ప్రకారం ప్రజలకు ప్రమాదకరంగా ఉండే వేగంతో లేదా డేంజరస్‌ డ్రైవింగ్‌గా పరిగణిస్తారు. కానీ ఈ సెక్షన్‌ను ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేయలేదు. అయితే ఎంవీఐ నివేదికతోపాటు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి సంజూష్‌ రక్త నమూనా నివేదిక వచ్చాక అందులోని అంశాల ఆధారంగా నిందితుడు సంజూష్‌పై ఎంవీ యాక్ట్, బీఎన్‌ఎస్‌లోని కొత్త సెక్షన్లను జోడించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ’సాక్షి’కి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement