సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరింది. ఆదివా రం మధ్యాహ్నం ఆమె బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. దాదాపు 15 నిమిషాలపాటు ఇద్దరి భేటీ జరిగిందని సమాచారం. అయితే బెంగళూరుకు వెళ్లి ఖర్గేను కలిసిన విషయంలో మంత్రి సురేఖ గోప్యత పాటించడం.. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్న ముందు రోజే ఆమె ఏఐసీసీ అధ్యక్షుడితో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
అన్ని విషయాలపై వివరణ
ఖర్గేను కలిసిన సందర్భంగా మంత్రి సురేఖ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై మాట్లాడినట్టు తెలిసింది. ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్‌మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్‌లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం.
బీజేపీ చీఫ్ రాంచందర్‌రావుకు తారసపడిన సురేఖ
మంత్రి కొండా సురేఖ బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురూ పలకరించుకున్నారని, ఆ సమయంలోనే బెంగళూరు నుంచి వస్తున్నానని సురేఖ వెల్లడించారని సమాచారం.


