ఒకవైపు పాకిస్తాన్.. మరోవైపు టర్కీ.. మధ్యలో సౌదీ అరేబియా. ఇప్పుడు ఈ సమీకరణంలోకి బంగ్లాదేశ్ కూడా అడుగుపెడుతుందా? అదే జరిగితే భారత్‌కు ఏంటి పరిస్థితి? ఢిల్లీకి ఇది కేవలం మరో దేశం తీసుకునే విదేశాంగ నిర్ణయమా? లేక భారత్ చుట్టూ మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలకు ఇది సంకేతమా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఆసియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ తొలిసారి సౌదీ–పాక్–టర్కీ రక్షణ వ్యవస్థలో చేరే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయకుండా.. ‘ముందు బంగ్లాదేశ్ ప్రయోజనాలే’ అంటూ తలుపులు తెరిచి ఉంచింది. దీంతో, కొత్త సమీకరణాలు భారత్ ముందుకు వస్తున్నాయి.
ఆగస్టు 7న మక్కాలో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. మిగిలిన రెండు దేశాలపై కూడా దాడిగా పరిగణించేలా పరస్పర రక్షణ సహకారానికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఇదే వ్యవస్థలోకి బంగ్లాదేశ్ వస్తే.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో మరో కొత్త సమీకరణం తెరపైకి రావడం ఖాయం.
బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీతో కూడిన ఆర్థిక లేదా రక్షణ వ్యవస్థలో చేరే అవకాశంపై బంగ్లాదేశ్ సానుకూల దృక్పథంతో ఉందని ఆయన చెప్పారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా.. అది బంగ్లాదేశ్, అక్కడి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మరో సహాయ మంత్రి షామా ఒబైద్ ఇస్లాం కూడా ఇదే మాట చెప్పారు. ఏ కూటమిలో చేరాలన్నా జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉంటాయని తెలిపారు.
భారత్‌కు అసలు ప్రశ్న..
ఇక్కడే భారత్‌కు అసలు ప్రశ్న మొదలవుతోంది. బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరితే వెంటనే భారత్‌కు సైనిక ముప్పు ఏర్పడుతుందా? ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అంచనాకు తావు లేదు. ఈ రక్షణ ఒప్పందం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఏర్పడినదని ఎక్కడా ప్రకటించలేదు. కాబట్టి బంగ్లాదేశ్ చేరినంత మాత్రాన భారత్‌పై యుద్ధ ముప్పు పెరుగుతుందని చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ సమస్య అంతకంటే లోతైనది. ఇది నేరుగా సైనిక ముప్పు కంటే.. దౌత్యం, వ్యూహాత్మక ప్రభావం, ప్రాంతీయ సమీకరణాలకు సంబంధించిన అంశం.
ఎందుకంటే భారత్‌కు బంగ్లాదేశ్ సాధారణ పొరుగు దేశం కాదు. ఈశాన్య భారతదేశానికి భౌగోళికంగా అత్యంత కీలకమైన దేశం. సరిహద్దు భద్రత నుంచి వాణిజ్యం వరకు, రవాణా మార్గాల నుంచి ప్రాంతీయ కనెక్టివిటీ వరకు ఢాకాతో న్యూఢిల్లీకి ఉన్న సంబంధాలు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. గత కొన్నేళ్లుగా భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు కూడా ఈ ప్రాధాన్యత చుట్టూనే బలపడ్డాయి. అలాంటి దేశం ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాలతో కూడిన రక్షణ వ్యవస్థకు దగ్గరవుతే.. ఢిల్లీకి మాత్రం అది సాధారణ పరిణామం కాదు. అందులోనూ పాకిస్తాన్ పేరు ఉండటం మరింత ఆసక్తికరం. భారత్-పాకిస్తాన్ సంబంధాలు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో నిండిన నేపథ్యంలో.. ఢాకా ఇస్లామాబాద్‌తో రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకుంటే పాక్‌కు దౌత్యపరంగా అదనపు బలం లభించే అవకాశం ఉంటుంది. దక్షిణాసియాలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ తన ప్రభావాన్ని విస్తరించేందుకు కొత్త వేదిక లభించినట్టవుతుంది.
టర్నీతో సవాల్..
టర్కీ కూడా ఈ సమీకరణంలో కీలక పాత్ర పోషిస్తోంది. పాక్‌తో టర్కీకి ఇప్పటికే సన్నిహిత రక్షణ సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తోనూ టర్కీ రక్షణ సహకారాన్ని విస్తరిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా ఆర్థిక, వ్యూహాత్మకంగా అత్యంత ప్రభావశీలమైన దేశం. ఈ మూడు దేశాలతో బంగ్లాదేశ్ ఒకే రక్షణ వ్యవస్థలోకి వస్తే.. పాకిస్తాన్‌కు పశ్చిమాసియా నుంచి దక్షిణాసియా వరకు విస్తరించే కొత్త దౌత్య నెట్‌వర్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే బంగ్లాదేశ్ వెంటనే ఆ కూటమిలో చేరబోతోందని చెప్పడానికి ఇప్పటివరకు ఆధారాలు లేవు. ఢాకా చెబుతున్న “బంగ్లాదేశ్ ఫస్ట్” విధానమే ఇక్కడ కీలకం. ఆర్థికంగా, వాణిజ్యపరంగా లేదా భద్రతాపరంగా తమకు ప్రయోజనం ఉంటేనే అడుగు ముందుకు వేస్తామని బంగ్లాదేశ్ స్పష్టం చేస్తోంది. అంటే ఇది భారత్‌కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అని ఇప్పుడే తేల్చేయలేం.
అయినా ఢిల్లీకి ఇది ఒక కీలక హెచ్చరిక మాత్రం కావచ్చు. బంగ్లాదేశ్ తన విదేశాంగ విధానాన్ని కొత్తగా సమతుల్యం చేసుకుంటోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తూనే.. పాక్, టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలతో కూడా వ్యూహాత్మక సంబంధాలను పెంచుకోవాలని ఢాకా చూస్తే.. దక్షిణాసియాలో భారత్ ఆధిపత్యానికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే.. బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరితే భారత్ సరిహద్దుల్లో వెంటనే సైనిక ముప్పు వచ్చేది కాదు. కానీ భారత్ చుట్టూ వ్యూహాత్మకంగా మారుతున్న సమీకరణాల్లో మరో కీలక మలుపు మాత్రం అవుతుంది. ఇవన్నీ కలిస్తే ఢిల్లీ తన ‘నెయిబర్‌హుడ్ ఫస్ట్’ వ్యూహాన్ని మరింత చురుగ్గా అమలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు.


