న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఐఫోన్ ఈఎంఐ చెల్లించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ డ్యాన్స్ టీచర్ యమునా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు, వరద నియంత్రణ విభాగం సిబ్బంది వెంటనే స్పందించి అతడిని ప్రాణాలతో కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళింది కుంజ్ ప్రాంతంలోని భోలా ఘాట్ వద్ద శుక్రవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఒక వ్యక్తి నదిలోకి దూకడంతో స్థానికులు కేకలు వేశారు.
ఆ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శివం, కానిస్టేబుల్ ఆనంద్ గౌతమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, బోట్లతో ఉన్న రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. బాధితుడిని ఓఖ్లా ఫేజ్-2 సంజయ్ కాలనీకి చెందిన దీపక్ కుమార్ (30)గా గుర్తించారు. వృత్తిరీత్యా డ్యాన్స్ టీచర్ అయిన దీపక్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఆదాయం తగ్గడంతో తీసుకున్న ఐఫోన్ ఈఎంఐలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. అనంతరం పోలీసులు అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులను పిలిపించి ఇంటికి పంపించారు. ఈ ఘాట్ ప్రాంతంలో గత 15 రోజుల్లోనే పోలీసులు, సహాయక బృందాలు సకాలంలో స్పందించి ఐదుగురి ప్రాణాలను కాపాడాయి.
ఇది కూడా చదవండి: అరిటాకుపై ఏ పదార్థం ఎక్కడ ఉండాలి? సంప్రదాయం ఇదే..


