తెలంగాణాలోని నల్సార్ లా యూనివర్సిటీ 2026 విద్యార్థులపై చర్యల వివాదంలో భంగపడ్డ బీజేపీ ఎంపీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ న్యాయవాది, బీసీఐ కో-ఛైర్మన్ వై.ఆర్. సదాశివ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఛైర్మన్ మనన్ మిశ్రానాయకత్వంలో బీసీఏ ప్రతిష్ట, ప్రమాణాలు దిగజారిపోయాయని ఆరోపించారు.
మిశ్రా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయనకు ఒక లేఖ రాయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ట్రస్ట్ పనితీరుపై కూడా రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ట్రస్ట్ నిష్క్రియంగా మారిందని, కౌన్సిల్ నిధులలో సుమారు రూ. 150 కోట్లు కొత్తగా సృష్టించబడిన ట్రస్ట్‌కు మళ్లించారని ఆరోపించడం సంచలనంగా మారింది.
తక్షణమే లేదా కనీసం ఈ లేఖ అందిన 15 రోజుల్లోపు రాజీనామా చేయాలని సదాశివ రెడ్డి తన లేఖలో కోరారు. అలాగే తాను లేవనెత్తిన అంశాలను పరిశీలించడానికి BCI ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సంబంధిత రికార్డులను ముందుగానే సభ్యుల ముందు ఉంచాలని కూడా ఆ లేఖలో కోరారు.
నిధుల స్పెషల్ ఆడిట్
బీసీఐ, బీసీఐ ట్రస్ట్ PEARL-First ఖాతాలపై కాగ్ (CAG - Comptroller and Auditor General of India) ప్యానెల్‌లోని స్వతంత్ర సంస్థతో ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ప్రతిపాదించారు. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నాటి నుండి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై ఈ ఆడిట్ జరగాలని, ఆ నివేదికను సభ్యులందరికీ అందించడంతో పాటు బహిరంగపరచాలని కూడా యాన డిమాండ్ చేశారు. అలాగే లా కాలేజీలు, యూనివర్సిటీలు లేదా మేనేజ్‌మెంట్‌ల నుండి ఎలాంటి విరాళాలు, ప్రాసెసింగ్ ఫీజులు లేదా చెల్లింపులను బిసిఐ లేదా దానికి అనుబంధ ట్రస్ట్‌లు స్వీకరించకుండా తక్షణమే నిలిపివేయాలన్నారు.
ఛైర్మన్‌పై సదాశివ రెడ్డి ప్రధాన ఆరోపణలు
బీసీఐలో నియామకాలను ఎటువంటి పారదర్శకమైన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ లేకుండానే చేపట్టారని ఆరోపించారు.
బిసిఐ ట్రస్ట్‌ను నిష్క్రియం చేసి, దాదాపు రూ.150 కోట్ల కౌన్సిల్ నిధులను కొత్తగా ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు మళ్లించినట్లు పేర్కొన్నారు.
అనుమతులు లేదా రెన్యూవల్స్ కోసం వచ్చే లా కాలేజీల నుండి నిరంతరం విరాళాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
బీసీఏ ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో కీలక పదవులను మనన్ మిశ్రా తన కుటుంబ సభ్యులకు కేటాయించారని విమర్శించారు.
నాల్సార్ (NALSAR) లా యూనివర్సిటీ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌పై సరైన ఆధారాలు లేకుండానే బిసిఐ చర్యలు తీసుకుందని ప్రశ్నలు లేవనెత్తారు.
రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో గ్రూపులు మరియు వర్గపోరును ప్రోత్సహిస్తున్నారని కౌన్సిల్ నాయకత్వంపై ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి: దారుణం బిల్‌పై బాడీ షేమింగ్ వివాదం : స్పందించిన కెఫే
మనన్ కుమార్ మిశ్రా స్పందన
ఆర్థిక అవకతవకలు, అనుమానాస్పద నియామకాలు,పారదర్శకత లోపం అంటూ తనపై వచ్చిన ఆరోపణలను చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తోసిపుచ్చారు. బీసీఐ సభ్యుడు వై.ఆర్. సదాశివ రెడ్డి చేసిన ఈ ఆరోపణలు నిరాధారమైనవని , రాజకీయ ప్రేరేపితమన్నారు.


